Aug 04,2022 06:55

ఆర్‌ఎస్‌ఎస్‌, కార్పొరేట్‌ కంపెనీల విధానాలు రెండూ ఒకటే కావడం నేటి పార్లమెంట్‌ తీరుకు నిదర్శనం. దేశ ప్రధాని పార్లమెంట్‌కు హాజరు కావడమే తక్కువ. క్యాబినెట్‌ మంత్రులు ప్రధానికి సహచరులుగా కాకుండా, నాయకుడిని గుడ్డిగా బలపరచే అనుచరులుగా మారిపోయారు. కీలక విధానాలను పార్లమెంట్‌లో కాకుండా బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో ప్రధాని ప్రకటించడం వెనుక రాజ్యాంగ బద్దమైన పార్లమెంట్‌ను ధిక్కరించడమే కాదు. తమ మధ్యయుగాల నాటి భావజాలాన్ని బలపరచడం, తమకు అండగా వున్న కార్పొరేట్‌ శక్తులకు సంపూర్ణ అభయం ఇవ్వడమనే కీలక అంశాలు వున్నాయి.

గత రెండు వారాలుగా పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనలు, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతున్నది. ఈ సమావేశాల్లో దేశ ప్రజలందరు ఎదుర్కొంటున్న అధిక ధరలు, ఆహార వస్తువులపై జిఎస్‌టి గురించి చర్చ జరగాలని, ఉపశమన చర్యలు తీసుకునే విధానాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని 16 ప్రతిపక్ష పార్టీలు పట్టుపట్టాయి. ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్షాలది ప్రజాభిప్రాయ ప్రతిబింబం. ప్రతిపక్షాలు లేవనెత్తిన ఈ అంశాలపై కనీసం చర్చకు కూడా ప్రభుత్వం అనుమతించకుండా 27 మంది పార్లమెంట్‌ సభ్యులను సస్పెండ్‌ చేసి తమ అప్రజాస్వామిక వైఖరిని బహిరంగంగా ప్రకటించుకున్నది. పార్లమెంట్‌లో చర్చ జరిగితే అనేక అంశాలు ప్రజల దృష్టికి వస్తాయి. అలా రావడం బిజెపి ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే చర్చకు అనుమతించడంలేదు. ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. నోట్ల రద్దు, జాతీయ పౌరసత్వ చట్టసవరణ, కరోనా (మొదటి, రెండవ విడతలు), ప్రతిపక్ష నాయకులు, కొందరు ప్రముఖులపై నిఘాకు సంబంధించిన పెగాసస్‌, కాశ్మీర్‌ ప్రత్యేక హోదా, 370వ ఆర్టికల్‌ రద్దు...ఇలా అనేక కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్రజాస్వామిక చర్యలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని ప్రతిపక్షాల సభ్యులు పట్టుపట్టడం, ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం, తమకు కావలసిన బిల్లులను గుట్టుచప్పుడు కాకుండా అనుమతించుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఎందుకిలా జరుగుతున్నది? ఇది సాధారణ పరిణామమా? బిజెపి భావజాలం, కార్పొరేట్‌ సంస్థల బలమైన బంధానికి ప్రతిరూపమా?
                 స్వాతంత్య్ర సాధనలో ముఖ్యమైన అంశం మనల్ని మనం పరిపాలించుకోవడం. 'తెల్లవారు పోవాలి' అనడంలో వున్నది రంగు, జాతి సమస్య కాదు. తమ కోసం విదేశీయులు చట్టాలను తయారుచేసే విధానం పోయి తమ చేత, తమ కొరకు, తమ వలన ఎంపికైన ప్రజాప్రతినిధులు తమ అభీష్టానికి, తమ సంక్షేమానికి ఉపకరించే చట్టాలు చేయాలనే బృహత్తరమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి వుంది. ఒకవేళ పాలకులు అలా వ్యవహరించకపోతే చట్టసభల్లో జరిగే చర్చల ద్వారా ప్రభుత్వ విధానాలపై నిలదీసి ప్రజా వ్యతిరేక విధానాలను మార్చేటట్లు చేయడానికి ప్రతిపక్షం వుండాలనే ఆకాంక్ష వుంది. దానికి అనుగుణంగానే రాజ్యంగంలో పార్లమెంట్‌ సభల గురించి, వాటి సమావేశాల తీరు గురించి చాలా వివరంగా పేర్కొనబడింది. రుతువుల ప్రకారం (వసంతకాలం, చలికాలం, ఎండాకాలం) చట్టసభల సమావేశాలు జరగాలని రాజ్యాంగ నిర్మాతలు చెప్పడానికి కారణం....ఆయా రుతువులలో వచ్చే అంశాల ప్రాధాన్యతతో పాటు సంవత్సరానికి నిర్దిష్ట గడువులలో సమావేశాలు జరగాలనే. అందుకే ఆయా రుతువులలో పార్లమెంట్‌ సమావేశాలు జరపడం ఒక తంతుగా కాక, పార్లమెంటరీ విధానంగా అమలవుతున్నది. ఇదే పద్ధతి రాష్ట్ర శాసనసభల సమావేశాల నిర్వహణలో కొనసాగుతుంది.
               ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తున్న బిజెపి సాధారణ రాజకీయ పార్టీ లాంటిది కాదు. రాజ్యాంగానికి లోబడి, తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతుల్లో విధానాల రూపకల్పన, కమిటీలను, నాయకులను ఎంపిక చేసుకోవడం సాధారణంగా రాజకీయ పార్టీల విధానం. కాని బిజెపి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) అనే ఒక సంస్థ ద్వారా నడపబడుతున్న రాజకీయ పార్టీ. అది ఆర్‌ఎస్‌ఎస్‌కు జవాబుదారీ పార్టీ. అందుకే బిజెపి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్వభావాలను అర్థం చేసుకోవాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి తెలుసుకోవాలి. ఆర్‌ఎస్‌ఎస్‌ లో దాని ముఖ్య నాయకుడు ఉపదేశం ఇస్తాడు. ఆ ఉపదేశ అంశాలే తమ విధానాలుగా అందులోని సభ్యులు ఆమోదిస్తారు. ఆ నాయకుడే తన వారసుణ్ణి కూడా నియమించుకుంటాడు. ఇది మధ్యయుగాల నాటి విధానానికి ప్రతిరూపం. ఇందులో ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు. అందుకే అది ప్రజాస్వామ్య వ్యతిరేక సంస్థ. ప్రభుత్వాలు నిర్వహించాలంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలి. కనుక కొన్ని నియమాలను పాటించక తప్పదు. అయితే ఆ నియమాలను ఎంత వీలైతే అంత బలహీనపరిచి, తమ మాతృ సంస్థ విధానాలను అమలు చేయడం బిజెపి కర్తవ్యం. చట్టసభల్లో చర్చలు సక్రమంగా జరగకపోవడానికి, రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేసి తమ వారిని నియమించుకోవడానికి ప్రధాన కారణం... దాని రాజకీయ ప్రయోజనమే కాదు, దాని భావజాల పునాది కూడా.
               అంతేకాదు భారత రాజ్యాంగాన్ని, అందులోని భారత ప్రజల 'ఆత్మ'ను ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తించదు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు రాజ్యాంగాన్ని గురించి ఏమన్నాడో చూడండి. ''మన రాజ్యాంగం గజిబిజిగా వున్నా, విజాతీయమైనది. విభిన్న పాశ్చాత్య దేశాల నుండి సేకరించిన నియమనిబంధనలతో నిండి వుంది''. మరి ఎలా వుండాలి? వర్ణాశ్రమ వ్యవస్థను బలపరిచే ''మనుస్మృతి ఆధారంగా వుండాలి'' అని చెప్పాడు. అందుకే భారత రాజ్యాంగ నియమాలను బిజెపి గౌరవించడంలేదు. మోడీ ప్రధాని అయినప్పుడు పార్లమెంట్‌ మెట్లకు మొక్కి ఇది దేవాలయం అని ప్రకటించడం...నేడు ఆ పార్లమెంట్‌ సాంప్రదాయాలను, విలువలను గౌరవించక పోవడం బిజెపి ద్వంద్వ విధానాల్లో భాగమే.
                 పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధిలో జరిగిన అనేక ఆధునిక నిర్మాణాల్లో పార్లమెంటరీ వ్యవస్థ ఒకటి. రాజ్యాంగబద్ద పాలన, సార్వజనీన ఓటింగ్‌ హక్కు, ప్రజాస్వామ్య హక్కులు కొద్దిమేరకైనా ప్రజలకు వున్నందుకు గత పాలనా పద్ధతుల కంటే ఇది మెరుగైనది. అయితే ఈ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించే సంజీవని కాదు ఈ పార్లమెంటరీ వ్యవస్థ. ''పాలక వర్గాల వ్యవహారాలను చక్కబెట్టే సాధనమే రాజ్యాంగ యంత్రాంగం'' అని కారల్‌ మార్క్స్‌ చాలాకాలం క్రితమే ప్రకటించాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడి తీవ్రమయ్యే కొద్ది పెరుగుతున్న ప్రజా ప్రతిఘటనలను సహించలేక, తాము రూపొందించుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంకుశత్వం వైపు ఈ వర్గం మళ్ళించగలదు. మత, జాతి విద్వేషాలతో వినాశనాన్ని సృష్టించగలదు అనేది ప్రపంచ చరిత్ర చెబుతున్న సత్యం.
              పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదం ఎవరి నుండి వస్తుందో సిపిఎం పార్టీ కార్యక్రమం (పేరా 5.23) ఇలా పేర్కొంది. ''శ్రామిక ప్రజల నుంచి, వారి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీల నుంచి పార్లమెంటరీ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ముప్పు రాదు. ఆ ప్రమాదం దోపిడి వర్గాల నుంచే వస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థను తమ సంకుచిత ప్రయోజనాలను రక్షించుకునే సాధనంగా చేయడం ద్వారా వారు ఆ వ్యవస్థను లోపలి నుంచి, బయటి నుంచి కూడా దెబ్బతీస్తారు''. స్వాతంత్య్రానంతరం మన దేశంలో ఎంతో అభ్యుదయంగా పరిఢవిల్లుతుందని నమ్మించిన ప్రజాస్వామ్యం...కేరళలో ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లో రద్దు చేయడానికి రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 356ను ఉపయోగించడం...ప్రజా ఉద్యమాలను సహించలేక ఎమర్జెన్సీ లాంటి అప్రజాస్వామిక విధానాన్ని అమలు చేయడం ఇందుకు చక్కటి ఉదాహరణలు. 1991 నుండి దేశంలో అమలవుతున్న సరళీకరణ విధానాలు మన చట్టసభలను మరింతగా బలహీనపరుస్తున్నాయి. రాజకీయ కార్యాచరణతో, రాజకీయ పార్టీలతో ఏ మాత్రం సంబంధంలేని కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారులు, విద్యా, వైద్య, మీడియా తదితర రంగాల కార్పొరేటు సంస్థల ప్రతినిధులు చట్టసభల్లోకి ఎగబాకుతున్నారు. గతంలో తెర వెనుక వుండి తమ ప్రయోజనాలను నెరవేర్చుకునే ఈ శక్తులు నేడు ఏకంగా చట్టసభల్లోకి రావడం పెరిగింది.
                 చట్టసభల పాత్ర తగ్గిపోతున్నా ఎంఎల్‌ఏ, ఎంపీ స్థానాలకు ఈ కాలంలో విపరీతమైన గిరాకీ పెరిగింది. వంద కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని, అంతకంటే ఎక్కువ ఇస్తే గవర్నర్‌ పదవి ఇప్పిస్తామని రూ. కోట్లు దండుకున్న కొందరు యువకులను ఈ మధ్యే అరెస్టు చేశారు. కొనగలిగిన సరుకుగా ఈ పదవులు మారాయి కాబట్టే వారు ఈ పదవులను అంగడి సరుకులుగా మార్చారు. ఇలాంటి శక్తులు పార్లమెంట్‌లో ప్రభుత్వ విధానాల గురించి చర్చలు జరగాలని, తాము మాట్లాడాలని, తమను ఎంపిక చేసిన ప్రజల పక్షాన నిలవాలని వర్గ స్వభావరీత్యానే అనుకోరు. అంతేకాదు తమ ప్రయోజనాలకు తోడ్పడే విధానాలు చట్టసభల్లో కాకుండా బయట జరగాలని, అందుకు ఈ పదవి తోడ్పడాలని కోరుకుంటున్నారు. అందుకే పార్లమెంట్‌ కంటే నాగపూర్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం)నే నమ్ముకుంటున్నారు.
               ఆర్‌ఎస్‌ఎస్‌, కార్పొరేట్‌ కంపెనీల విధానాలు రెండూ ఒకటే కావడం నేటి పార్లమెంట్‌ తీరుకు నిదర్శనం. దేశ ప్రధాని పార్లమెంట్‌కు హాజరు కావడమే తక్కువ. క్యాబినెట్‌ మంత్రులు ప్రధానికి సహచరులుగా కాకుండా, నాయకుడిని గుడ్డిగా బలపరచే అనుచరులుగా మారిపోయారు. కీలక విధానాలను పార్లమెంట్‌లో కాకుండా బహిరంగ సభల్లో, విదేశీ పర్యటనల్లో, పారిశ్రామికవేత్తల సమావేశాల్లో ప్రధాని ప్రకటించడం వెనుక రాజ్యాంగ బద్దమైన పార్లమెంట్‌ను ధిక్కరించడమే కాదు, తమ మధ్యయుగాల నాటి భావజాలాన్ని బలపరచడం, తమకు అండగా వున్న కార్పొరేట్‌ శక్తులకు సంపూర్ణ అభయం ఇవ్వడమనే కీలక అంశాలు వున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా వామపక్షాల నాయకత్వంలోని కేరళ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో 61 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపి ఆదర్శంగా నిలిచింది.
                పార్లమెంటరీ వ్యవస్థ లోని లోపాలను గుర్తిస్తూనే అందులోని ప్రజాస్వామ్య పద్ధతులను కాపాడుకోవలసి వుంది. ప్రజా ప్రయోజనాల కోసం పార్లమెంటరీ, ప్రజాస్వామ్య సంస్థలను కాపాడుకోవలసిన అవసరం పెరిగింది. రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ 1948 నవంబర్‌ 4న ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ ''రాజ్యాంగం ప్రజాతంత్రయుతంగా పని చేయాలంటే రాజ్యాంగ నైతికత అందరిలోనూ అలవడాలి'' అన్నాడు. నేటి పరిస్థితుల్లో ''భారత గణతంత్ర రాజ్య లౌకిక లక్షణాన్ని కాపాడాలి. రాజ్యాంగ వ్యవస్థ మూల స్తంభాలను పటిష్టపరచడానికి ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలి'' అని సిపిఎం 23వ అఖిల భారత మహాసభ పిలుపునిచ్చింది.

                                                   మతతత్వ, కార్పొరేట్‌ విధానాలు పార్లమెంటరీ వ్యవస్థకు ప్రమాదాలు
                                           వి. రాంభూపాల్‌ / వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /