
న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుని వెంటనే అమలు చేసి, కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లుపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ''ఈ బిల్లు అమలు చేయాలంటే పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. అప్పుడు కూడా అమలవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేము'' అని అన్నారు. కులగణనను వెనక్కి నెట్టే వ్యూహమని మండిపడ్డారు.
''కొద్దిరోజుల క్రితం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారారు. ఇది మంచి విషయం. మొదట అజెండా గురించి తెలియదు. తర్వాత అది మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టేందుకని మాకు తెలిసింది '' అని అన్నారు. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత బిల్లు అమలు చేయబడుతుంది. అన్నారు. ఎంపిలు సభలో కేవలం విగ్రహాలు మాత్రమేనని, చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో వారికి ఎలాంటి అధికారం ఉండదని విమర్శించారు. కులగణన ద్వారా ఒబిసిలను గుర్తించవచ్చని అన్నారు. జన, కుల గణన నుండి వచ్చిన డేటా ప్రజలను మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. తాము అధికారం చేపట్టగానే.. కులగణణ చేపడతామని, ఒబిసి కమ్యూనిటీకి అధికారం ఇస్తామని, పాలనలోనూ భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు.