Nov 17,2023 22:30

- బిజెపిని కూకటి వేళ్లతో పెకిలిస్తాం
- కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో:రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలో బిజెపిని 2024 ఎన్నికల్లో కూకటి వేళ్లతో పెకిలిస్తామని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. తెలంగాణలో ఇకపై బిజెపి కనిపించబోదన్నారు. అధికారలోకి రాగానే కేంద్రంలో కులగణన చేపడతామని తెలిపారు. బిసిల రిజర్వేషన్‌ పెంచుతామన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్‌తోనే తమ యుద్ధమని, కాంగ్రెస్‌ తుపాన్‌లో కెసిఆర్‌ గల్లంతు కాక తప్పదన్నారు. కెసిఆర్‌ దోచుకున్న కోట్ల సొమ్ము అంతా పేదలకు పంచుతామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేస్తామని చెప్పారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, వరంగల్‌ జిల్లా నర్సంపేట, వరంగల్‌లో రోడ్డు షోలు నిర్వహించారు. జైపూర్‌ నుంచి ఎపిలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌ గాంధీ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మణుగూరుకు చేరుకున్నారు.
ఆయా బహిరంగ సభల్లో రాహుల్‌ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ ఏమిచ్చిందని కెసిఆర్‌ అడుగుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ కాదా అని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కెసిఆర్‌ అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం అన్నదమ్ముళ్ల వలే కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఇందిరా, రాజీవ్‌ గాంధీ చేసిన అభివృద్ధి కనబడుతుందని, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల లక్ష కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఆరు గ్యారంటీ పథకాల మీదనే తొలి సంతకం పెట్టిస్తా అని తెలిపారు. కాంగ్రెస్‌కు, ముఖ్యంగా ఇందిరా, సోనియా గాంధీలకు తెలంగాణతో.. రాజకీయ సంబంధంతో పాటు కుటుంబ సంబంధం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఎన్నో సమస్యలు వచ్చినా సోనియా గాంధీ నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని ఇస్తే.. దాన్ని కెసిఆర్‌ కుటుంబం దోచుకుంటుందని విమర్శించారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు రూ.మూడు లక్షలు వసూళ్లు చేయడం సిగ్గు చేటన్నారు. బిఆర్‌ఎస్‌, బిజెపి స్కీములతో కొంతమందికే లాభం చేకూరుతుందని, అదానికి మోడీ లాభం చేకూరుస్తున్నారన్నారు. భారత్‌ జోడోయాత్ర సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ప్రజలను ఏ విధంగా విభజిస్తున్నాయో అర్థమైందన్నారు. ఇది విద్వేషాలు రగిలించే దేశం కాదని, ప్రేమను పంచే దేశమని తెలిపారు.