-సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్
-ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ప్రతిపక్షాల విమర్శలు
-ప్యానల్‌ను మహిళా సభ్యులతో విస్తరించిన ఛైర్మన్
న్యూఢిల్లీ : ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును రాజ్యసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మిగిలింది. అది లాంఛనమే కావడంతో బిల్లు త్వరలోనే చట్టంగా మారనుంది. అయితే, దీని ఫలాలు అందడానికి మాత్రం మహిళాలోకం 2029 వరకు నిరీక్షించాల్సిఉంది. జన గణన, నియోజకవర్గాల పునర్‌విభజన పూర్తయిన తరువాతే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయంటూ బిల్లులోకి పేర్కొనడమే దీనికి కారణం. రాజ్యసభలో గురువారం జరిగిన చర్చలో పాల్గన్న ప్రతిపక్షాల సభ్యులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. ఒబిసి మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వకపోవడాన్ని కూడా పలువురు సభ్యులు తప్పుపట్టారు. రాజ్యసభలోసుదీర్ఘంగా దాదాపు పది గంటల పాటు చర్చ కొనసాగింది. సందేహాలకు సమాధానమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తోసిపుచ్చారు. ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. లోక్‌సభలో మాన్యువల్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించిన ప్రభుత్వం రాజ్యసభలో ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా ఓటింగ్ నిర్వహించింది. గురువారం జరిగిన చర్చ సందర్భంగా అధ్యక్ష స్థానంలో అధికసమయం మహిళలే కనిపించారు. సభ ప్రారంభం కాకముందే వైస్ ఛైర్మన్ ప్యానల్‌ను మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసం ప్రత్యేకంగా 13 మంది మహిళా సభ్యులతో ఛైర్మన్ జగ్‌దీప్ ధనఖర్ విస్తరించారు. సభ ప్రారంభమైనప్పుడు సీట్లో కొద్దిసేపు కనిపించిన ఆయన ఆ తరువాత తప్పుకున్నారు. బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పుడు అధ్యక్షస్థానంలో పిటి ఉష ఉన్నారు. కాంగ్రెస్ సభ్యురాలు రంజీత్ రంజన్ చర్చను ప్రారంభించారు. అంతకుముందు న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. ఉజ్వల యోజన, ముద్ర యోజన తదితర కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు అనంతరం చర్చను ప్రారంభించిన రంజీత్ రంజన్ చట్ట సభల్లో రిజర్వేషన్లు పొందడం మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. ప్రధాని మోడీ మహిళలపై సానుభూతితో రిజర్వేషన్లు ఇస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంటోందని, అది వాస్తవం కాదని చెప్పారు. వాస్తవానికి మోడీ సర్కారు హయంలో మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయో దేశంలో ప్రజలందరికి తెలుసని అన్నారు. దేశ రాజధానిలో బాక్సింగ్ క్రీడాకారిణిలు చేసిన ఆందోళన, మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరుగించడం. హర్యానాలో దాడులు తదితర అంశాలను ఆమె ప్రస్తావించారు. 'మాకు హక్కులు కావాలి. మీ సానుభూతి కాదు' అని ఆమె అన్నారు. బిజెపి సభ్యుడు జెపి నడ్డా మాట్లాడుతూ మహిళలకు సాధికారత కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్నికలలో లబ్ధి పొందడమే తమ లక్ష్యమైతే తక్షణమే రిజర్వేషన్లు అమలయ్యేలా బిల్లును తెచ్చేవారమని, చెప్పారు. ప్రభుత్వం నేరుగా లోక్‌సభ స్థానాలను రిజర్వు చేయలేదని అందువల్లే అమలుకు జాప్యం జరుగుతోందన్నారు. జనాభాలెక్కలు, నియోజకవర్గ పునర్విభజన పూర్తయిన తరువాత న్యాయవ్యవస్థ కన్నుసన్నల్లో ఆ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వంలో సభ్యుడిగా తాను వేనాడ్‌నో, అమేథినో, రాయబరేలినో రిజర్వు చేస్తే ఏమిటి పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు.
- మహిళా మాసంగా ప్రకటించండి : విజయసాయి రెడ్డి
సెప్టెంబర్ నెలను మహిళా మాసంగా ప్రకటించాలని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాల్టీలు, పంచాయతీలలో మహిళలకు రిజర్వేషన్లను నూరు శాతం అమలు చేస్తున్నట్లు చెప్పారు. 73,74 రాజ్యాంగ సవరణలలో సూచించిన బెంచ్‌మార్క్‌ను రాష్ట్రంలో అధిగమించామని చెప్పారు.
- మరో జుమ్లా కాకూడదు : మల్లికార్జున ఖర్గే
మోడీ ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాల తరహాలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా మరో జుమ్లా కాకూడదని కాంగ్రెస్ పార్టీపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బిల్లు అమలుకు 2029 వరకు వేచి చూడాల్సి ఉండటం అనేక అనుమానాలకు అస్కారం కలిగిస్తోందని అన్నారు. బిల్లులో ఒబిసిలను విస్మరించారని చెప్పారు. ఇన్ని లోపాలున్నప్పటికీ బిల్లుకు మద్దతిస్తుండటం మహిళా రిజర్వేషన్ల పట్ల తమ పార్టీకి ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.