''చంద్రయాన్-3 విజయాన్ని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నది. దాని లాంచ్ ప్యాడ్‌ను తయారు చేయడానికి తమ రక్తాన్ని, చెమటను అందించిన హెచ్‌ఇసి ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల సంగతేంటి? మేము చంద్రయాన్-3 కోసం ఉపయోగించిన లాంచ్ ప్యాడ్‌ను తయారు చేశాం. కానీ ఇప్పటికీ మా జీతం కోసం ఎదురుచూస్తున్నాం'' ఇది ప్రతిష్టాత్మకమైన ఓ ప్రభుత్వరంగసంస్థ ఉద్యోగుల ఆవేదన.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు అనేక పరికరాలను అందించిన హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ (హెచ్‌ఇసి)కి చెందిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్‌లతోసహా సుమారు 3,000 మంది ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయి. 20 నెలలుగా వారికి వేతనాలు అందటం లేదు. ఇప్పుడు వారు పూట గడవటం కోసం తినుబండారాలు, వస్త్రాలు అమ్మటం, ఆటోరిక్షాలు నడపడంతోసహా ఇతర రోజువారీ వేతన కార్మికులుగా పనిచేయాల్సి వస్తున్నది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాభివృద్ధికి పాటుపడే ఈ ఉన్నతోద్యోగుల స్థితి దేనికి సూచిక..? బలమైన ప్రధాని.. బలమైన ప్రభుత్వం.. అని చెప్పుకుంటున్న వారు దీనికి సమాధానం చెపుతారా...?
న్యూఢిల్లీ : హెచ్‌ఇసి అన్ని ప్రధాన ఉక్కు కర్మాగారాలకు పరికరాలను సరఫరా చేసే భారతదేశపు ప్రభుత్వ రంగ యూనిట్. బొకారో, భిలారు, రూర్కెలా, విశాఖపట్నం, దుర్గాపూర్‌లోని ప్లాంట్‌లతో సహా భారతదేశం అంతటా అనేక ప్రధాన ఉక్కు కర్మాగారాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. హెచ్‌ఇసి మూడు విభాగాలను కలిగి ఉన్నది. అవి.. హెవీ మెషిన్ టూల్స్ ప్లాంట్ (హెచ్‌ఎంటిపి), హెవీ మెషీన్స్ బిల్డింగ్ ప్లాంట్ (హెచ్‌ఎంబిపి), ఫౌండ్రీ ఫోర్జ్ ప్లాంట్ (ఎఫ్‌ఎఫ్‌పి). ఇవి సంయుక్తంగా పరికరాలను తయారు చేస్తాయి.
అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే తమ ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్)లో ఎక్కువ భాగాన్ని విత్ డ్రా చేసుకున్నారు. కొందరు బయట అప్పులు కూడా చేశారు. చివరికి దినసరి కూలీలుగా మారి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఆటో డ్రైవర్‌గా ఉమేశ్ నాయక్
మరో ఉద్యోగి ఉమేష్ నాయక్ ఆటోరిక్షా డ్రైవర్‌గా పార్ట్‌టైమ్ పనిచేస్తున్నాడు. ''నా కుటుంబాన్ని పోషించుకోవటానికి సాయంత్రం 5 గంటల తర్వాత నేను ఆటో నడుపుతాను. ఒక నెలలో, నేను రూ.10,000 నుండి రూ 12,000 వరకు సంపాదించగలను. ఇలా నేనొక్కడినే కాదు.. వారి కుటుంబాలను పోషించుకోవటానికి పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో ఉన్న అనేకమంది హెచ్‌ఇసి ఉద్యోగులు ఉన్నారు. కొందరు కూరగాయలు విక్రయిస్తుంటారు. మరికొందరు వీధి పక్కన చిరుతిండి, ఇతర తినుబండారాలను అమ్ముతున్నారు. చాలా రోజుల నుంచి మాకు జీతం రాకపోవడంతో మాకు ఓపిక నశిస్తున్నది'' అని నాయక్ చెప్పారు.
కుటుంబంతో సహా మోమోలు అమ్ముతూ..
మరొక హెచ్‌ఇసి ఉద్యోగి అజరు మిర్ధా కుటుంబం మొత్తం మోమోలను అమ్ముతున్నారు. 'భారత ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని మా జీతాలను విడుదల చేస్తుందని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను'' అని మిర్ధా చెప్పటం గమనార్హం.
పదేళ్ల క్రితం హెచ్‌ఇసికి మోడీ...
2013 డిసెంబర్‌లో ప్రధాని మోడీ అప్పటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడానికి రాంచీని సందర్శించారు. ఆ సమయంలో హెచ్‌ఇసి పరిస్థితిపై నిరాశ వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ప్రభుత్వం వచ్చి పదేళ్లు గడుస్తున్నా.. హెచ్‌ఇసి మూతపడే దశలో ఉన్నదని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'కేంద్రం బాధ్యత వహించాలి'
''అత్యున్నత యాజమాన్యం నిజాయితీగా పని చేస్తే కార్మికులు వేతనాల్లేని పరిస్థితిని ఎదుర్కొనేవారు కాదు. కేంద్రం దీనికి బాధ్యత వహించాలి. వీలైనంత త్వరగా జీతాలు విడుదల చేయాలి'' అని ఉద్యోగులు డిమాండ్ చేశారు. హెచ్‌ఎంటిపి ఇన్‌స్పెక్టర్ (క్వాలిటీ కంట్రోల్) కమలేష్ శర్మ మాట్లాడుతూ.. ''2010లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం హెచ్‌ఇసిని సందర్శించారు. భారత్‌కు అలాంటి సంస్థ అవసరమని నొక్కిచెప్పారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం మాత్రం గుడ్డిగా మారింది'' అనిహెచ్‌ఇసి వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామశంకర ప్రసాద్ విమర్శించారు.
దుస్తులు విక్రయిస్తూ..
1993 నుంచి హెచ్‌ఇసిలో పనిచేస్తున్న దేవేంద్ర కుమార్.. పాత విధానసభ సమీపంలోని షాలిమార్ బజార్‌లో గంచా (టవల్స్), లేడీస్ గార్మెంట్స్‌తో సహా రెడీమేడ్ దుస్తులను విక్రయించాల్సి వస్తున్నది. ఇప్పటికీ హెచ్‌ఎంబిపిలో పనిచేస్తున్న కుమార్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయానికి హాజరవుతాడు. ఆ తర్వాత బట్టల సేల్స్‌మెన్‌గా పని చేస్తాడు. కుమార్ రోడ్డు పక్కన ఒక తాత్కాలిక దుకాణాన్ని నడుపుతున్నాడు. బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన కుమార్ మాట్లాడుతూ.. ''జీతం లేకుండా జీవించడం చాలా కష్టం. రాంచీలో డిగ్రీ కోర్సులు చదువుతున్న నా ముగ్గురు పిల్లల చదువుకు నేను తోడ్పాటు అందించలేకపోతున్నాను. నా పెద్ద కొడుకు మెడిసిన్ చదవాలనుకున్నాడు. అతని అడ్మిషన్ కోసం మా దగ్గర డబ్బు లేదు. మేము ఆర్థికంగా చితికిపోవటంతో ఎవరూ మాకు డబ్బు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది'' అని అన్నారు.
కూలీగా అశోక్ రామ్
హెచ్‌ఇసి మరో ఉద్యోగి అశోక్ రామ్.. ధ్రువ ప్రాంతంలో రోజువారీ కూలీగా మారాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రామ్, అతని భార్య యశోదా దేవి రోజువారీ కూలీలుగా పని చేస్తూ రోజుకు రూ.450 సంపాదిస్తున్నారు. ''నా పిల్లలు ప్రయివేటు స్కూల్‌లో చదివేవారు. నేను వారి ఫీజులను భరించలేక వారిని జగన్నాథ్‌పూర్ మాధ్యమిక పాఠశాలకు మార్చవలసి వచ్చింది'' అని అశోక్ రామ్ చెప్పారు.