Oct 26,2023 15:49

న్యూఢిల్లీ :  తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి మహువా మొయిత్రీకి లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ గురువారం సమన్లు జారీ చేసింది. 'ప్రశ్న కోసం నగదు' వివాదాస్పద ఆరోపణలపై ఈనెల 31న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. మహువా మొయిత్రీకి వ్యతిరేకంగా వచ్చిన ఈ ఆరోపణలు 'చాలా తీవ్రమైనవి' గా కమిటీ భావించినట్లు  సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ వివాదాస్పద అంశంపై గురువారం లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో కమిటీ  బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహద్రారు ఇరువురి వాదనలను విన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. మొయిత్రీపై వచ్చిన ఆరోపణలకు  సంబంధించి  ప్రతి అంశాన్ని చర్చించినట్లు పేర్కొన్నాయి.
లోతైన దర్యాప్తు కోసం కేసుకు సంబంధించిన కీలక అంశాలపై వివరాలు కోరుతూ సమాచార మంత్రిత్వ  శాఖకు, హోం మంత్రిత్వ శాఖకు లేఖలు పంపినట్లు లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ వినోద్‌ సోంకర్‌ మీడియాకు తెలిపారు.