న్యూఢిల్లీ : అటు కరోనా మహమ్మారి, ఇటు ఆర్థిక మాంద్యం ఈ రెండు సంక్షోభాల్లో చిక్కుకున్న ప్రజలకు పెద్ద ఎత్తున ద్రోహం చేసే రీతిలో ఈసారి కేంద్ర బడ్జెట్ వుందని సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. కార్మికుల బాధలను, ఇబ్బందులను మరింత పెంచుతూవారిని పణంగా పెట్టి కొద్దిమంది బడా కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలను పెంచి పోషించడానికే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పడానికి ఈ బడ్జెట్ స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించింది. గొప్పగా ప్రగల్భాలు చెప్పుకుంటున్నప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం ఈ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తోంది. 2021 - 22లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం 34.8లక్షల కోట్ల రూపాయిలుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇది, 2020 - 21లో పేర్కొన్న మొత్తానికి నామమాత్రంగా సమానంగానే వుంది. కానీ వాస్తవానికి ప్రభుత్వ వ్యయంలో కోత వుంది. దీన్ని బట్టి ప్రజల పట్ల తనకున్న బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని స్పష్టమవుతోంది. కేవలం కొద్దిమంది ప్రయోజనాలను మాత్రం భారీగా పెంచుతూ పోతోంది. జాతీయ ఉత్పాదక ఆస్తులపై వారి నియంత్రణను మరింత పెంచడంతో సహా అన్ని చర్యలు తీసుకుంటోంది.
జిడిపి, ద్రవ్య లోటు నిష్పత్తి (2020 - 2021 సంవత్సరం) 9.5 శాతం స్పష్టంగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇది, వ్యయం పెరగడం వల్లనేనని ప్రభుత్వం చెప్పుకుంటోంది కానీ ప్రాధమికంగా రెవిన్యూ కుప్పకూలడం వల్లనే జరిగింది. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తీవ్రంగా పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీగా అదనపు పన్నుల భారాన్ని ప్రభుత్వం మోపినప్పటికీ రెవిన్యూ కుప్పకూలింది. పైగా, ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం వనరుల బదిలీ గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే 40వేల కోట్లకు పైగా తగ్గిపోయింది. 2020 - 21లో కార్పొరేట్, ఆదాయపన్నుల మొత్తాలు బాగా పడిపోయాయి. అంతేకాదు, కొవిడ్‌కు ముందున్న కాలానికి పన్నులు చెల్లించినప్పటికీ 2021 - 22 లో కూడా కార్పొరేట్ రంగం, సంపన్నులు పన్నులు చెల్లించబోరని ఊహించడం ద్వారా ప్రభుత్వం ముందుగానే వారి బాధను గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. 2020 - 21లో కార్పొరేట్, ఆదాయపన్నుల వసూళ్ళు వరుసగా 6.81, 6.38లక్షల కోట్లు వుంటాయని బడ్జెట్ అంచనా వేసింది. 2021 - 22 సంవత్సరానికి కూడా ఈ అంకెలు వరుసగా 5.47. 5.61లక్షల కోట్లుగా వుంటాయని పేర్కొంది.
2020 - 21లో 34.5లక్షల కోట్లకు సవరించిన ప్రభుత్వ వ్యయం అంచనాలు వాస్తవ వ్యయం యొక్క ద్రవ్యోల్బణాన్ని సూచిస్తున్నాయి. 2020 డిసెంబరు చివరి నాటికి వాస్తవంగా 22.8లక్షల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. బడ్జెట్ అంచనాల్లో కన్నా కేంద్ర ప్రభుత్వ వ్యయానికి సంబంధించి సవరించిన అంచనాల్లో నాలుగు లక్షల కోట్లు పెరుగుదల ప్రధానంగా ఆహార సబ్సిడీ కోసం ఎఫ్‌సిఐకి ఎన్‌ఎస్‌ఎస్‌ఎఫ్ రుణాన్ని నిలిపివేసి, బడ్జెట్‌కు బదిలీ చేయడం వల్ల వచ్చింది. 2020 - 21తో పోల్చుకుంటే 2021 - 22లో ఆహార సబ్సిడీలకు కేటాయించిన బడ్జెట్ మొత్తాలు కూడా 41శాతం కోతపడ్డాయి.
2020 - 21లో బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద పేర్కొన్న వ్యయం కన్నా వాస్తవ వ్యయం తగ్గిందనేది ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వెల్లడించలేదు. ఆ పద్దుల్లో వ్యవసాయం, విద్య, సామాజిక సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం, శాస్త్రీయ విభాగాలు, పట్టాణాభివృద్ధి, పెన్షన్లు, వికలాంగ వ్యవహారాలు వంటివి వున్నాయి. ఈ కోతలు తదుపరి సంవత్సరానికి కూడా కొనసాగాయి. అంతేకాకుండా, 2020 - 21లో వ్యయం పెరిగిన కొన్ని పద్దులు అంటే ఆరోగ్యం, గ్రామీణాభివృద్ది వంటి రంగాలకు కూడా వ్యయంలో కోతలు విధిస్తూ ఈ బడ్జెట్ ప్రతిపాదించింది. ఆరోగ్య రంగ వ్యయం గణనీయంగా పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పినప్పటికీ బడ్జెట్ పత్రాలు మరో రకంగా చూపిస్తున్నాయి. 2021 - 22 సంవత్సరానికి ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు 74,600కోట్లుగా వుంది. ఇది, గతేడాది సవరించిన అంచనాల కన్నా 8వేల కోట్లు తక్కువగా వుంది. ఇటువంటి కోతలు విధించడం ద్వారా మొత్తం వ్యయంలో కోత విధించడాన్ని ఆర్థిక మంత్రి సాధించారు. ప్రజలపై అమలు చేస్తున్న అతిపెద్ద బూటకం ఇది.
భారతదేశ ఆస్తులను అమ్మేయడం, లాభాలార్జిస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటీకరించడమే సర్వరోగ నివారిణిగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. డబ్బులు వచ్చేందుకు ఈ బడ్జెట్‌లో ప్రకటించిన ప్రాజెక్టు ఏమిటంటే ప్రభుత్వ రంగ కంపెనీల అధీనంలో వున్న విలువైన భూములను కూడా విక్రయించడమే. ఈ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1.75లక్షల కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. బీమా రంగంలో ఎఫ్‌డిఐలను 74శాతానికి పెంచారు. ఇది తీవ్రంగా అభ్యంతరం చెప్పాల్సిన అంశం. ఈ ప్రైవేటీకరణ క్రమాన్ని కొనసాగించడమంటే జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసి, ఆత్మనిర్భరతా నినాదాన్ని అపహాస్యం పాల్జేయడమే.
కొవిడ్ సృష్టించిన ప్రజారోగ్య సంక్షోభం ఇంకా ముగియలేదు. వ్యాక్సిన్లపై పెట్టే వ్యయం ఒక్కటే అదనపు వ్యయంగా చెప్పుకోవచ్చు. అది ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమే. ఇక ఆర్థిక సంక్షోభం, దీనిలో అతి ముఖ్యమైన అంశమేమంటే ఉపాధి, జీవనోపాధులు నాశనం కావడం, ఆదాయాలు పడిపోవడం, డిమాండ్ కుప్పకూలడం. ఈ సంక్షోభ పరిష్కారానికి భారీ మొత్తంలో అదనపు వ్యయం అవసరం. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర బడ్జెట్, అసలే అంతంత మాత్రంగా వున్న వ్యయాల్లో మరింత కోతలను పెట్టాలని కోరుతోంది. కార్పొరేట్లకు రాయితీలను ఇవ్వజూపుతోంది. మహా విపత్తుకు ఈ బడ్జెట్ ఒక నాందీ ప్రస్తావన మాత్రమే. ప్రజల ఇబ్బందులు, కష్టాలు మరింత పెరగడానికే ఈ బడ్జెట్ దారి తీస్తుంది. ఇప్పటికే దేశంలో వున్న తీవ్రమైన అసమానతలను మరింత పెంచుతుంది.
ఈ కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియచేయాల్సిందిగా ప్రజలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది. తక్షణమే నగదు బదిలీలకు, ఉచిత ఆహారానికి, సార్వజనీన ఉపాధి హామీ కార్యక్రమాలకు పోరాటాలను ఉధృతం చేయాలని కోరింది.










