ఇజ్రాయిల్, హమస్ ఘర్షణలపై సిపిఎం పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : హమాస్, ఇజ్రాయిలీ బలగాల మధ్య పాలస్తీనాలోని గాజాలో జరుగుతున్న దాడులు, ప్రతిదాడులను సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి తీవ్రత చూస్తుంటే మరింతమంది ప్రాణాలు బలిగొనేలా, కష్టాలు కడగండ్లకు గురిచేసేలా ఉంది. కాబట్టి ఈ ఘర్షణలకు వెంటనే స్వస్తి పలకాలి.
ఇజ్రాయిల్‌లోని పచ్చి మితవాద నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనాలోని భూములను విచక్షణారహితంగా ఆక్రమించి, అక్రమంగా యూదుల నివాసాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు అంటే ఈ ఘర్షణలకు ముందు రోజువరకు 40 మంది పిల్లలతో సహా 248 మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు.
మాతృభూమికి సంబంధించి పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించేలా ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలి. పాలస్తీనా భూ భాగంలో ఇజ్రాయిల్ అక్రమంగా ఏర్పాటు చేసిన నివాసాలు, ఆక్రమణలను ఉపసంహరించుకోవాలి. రెండు దేశాల ఏర్పాటుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) తీర్మానాన్ని అమలు చేయాలి.ఐరాస చేసిన తీర్మానానికి అనుగుణంగా తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పడాలి. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసేలా చూసేందుకు ఐరాస, భారత ప్రభుత్వంతో సహా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలి. అలాగే ఐక్యరాజ్య సమితి తీర్మానం అమలుకు అవి తగు చొరవ చూపాలని సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.










