- ఎన్నికల హామీలు అమలు చేయని బిజెపిని ఓడించండి
ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి కర్నూలు:రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే డిమాండ్ చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు... ఏడాది కాలంలో ఒడిశా తదితర ఐదు ప్రాంతాల్లో రైలు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయని బిజెపిని ఓడించాలని పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలులోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి రైల్వే మంత్రి లాల్ బహుదూర్‌శాస్త్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. నేడు దేశాన్ని పాలిస్తున్న మోడీ హయాంలో సంవత్సర కాలంలోనే ఐదు పెద్ద రైలు ప్రమాదాలు జరిగినా ఏ ఒక్క మంత్రీ రాజీనామా చేయలేదని తెలిపారు. ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదని, ఇది నరేంద్ర మోడీ పరిపాలన తీరని విమర్శించారు. ఇటీవల వందే భారత్ రైళ్లు ప్రారంభించామని గొప్పలు చెప్తోన్న బిజెపి... రైల్వే రంగ భద్రతపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. రైల్వేను ప్రయివేటీకరిస్తూ భద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు. బిజెపి విదేశాంగ విధానం ఆందోళనకరంగా ఉందని, భారతదేశానికి మిత్ర దేశమైన పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు చేస్తోన్నా నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సంఘీభావంగా ఓటింగ్ జరిగితే భారత ప్రభుత్వం పాల్గనకుండా అమెరికా సామ్రాజ్యవాదానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. పాలస్తీనా ప్రజలు కేవలం ముస్లిములు కావడం వల్లనే బిజెపి ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య మతం పేరుతో వైషమ్యాలు సృష్టించాలని చూస్తోన్న బిజెపి దేశాన్ని పాలించే అర్హత కోల్పోయిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను, యువతను, కార్మికులను, మహిళలను నమ్మకద్రోహం చేసిందని విమర్శించారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 679 మండలాలకుగానూ దాదాపు 400 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఇప్పటి వరకూ కరువు మండలాలు ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. రాజస్థాన్‌లో 17, ఛత్తీస్‌గఢ్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణాలో ఫ్రెండ్లీ పార్టీలతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. బిజెపిని, బిజెపి బలపరిచే రాజకీయ పార్టీలను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల తదితరులు పాల్గొన్నారు.










