
న్యూఢిల్లీ : అమెరికాలోని క్యూబా దౌత్య కార్యాలయ ఆవరణపై ఈ నెల 24న జరిగిన తీవ్రవాద దాడిని సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ, ఆస్తి నష్టమైతే చోటు చేసుకుందని పేర్కొంది. 2020 ఏప్రిల్‌లో మొదటిసారి క్యూబా దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. ఇది రెండవది. సోషలిస్టు క్యూబా పట్ల అమెరికా ప్రభుత్వ ఘర్షణాయుత వైఖరిని దృష్టిలో వుంచుకున్నట్లైతే, మూడేళ్ల తర్వాత కూడా ఆనాటి దాడికి కారకులైన వారిపై ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పంద నిబంధనలకు అమెరికా ప్రభుత్వం కచ్చితంగా కట్టుబడి వుండాలని, వాటిని అమలు చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.