మోడీ ప్రభుత్వం, బిజెపి కలిసి రాజ్యాంగంపై, దేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులపై మరో తీవ్రమైన దాడికి యోచిస్తున్నాయి. ''ఒకే దేశం, ఒకే ఎన్నిక'' అన్న ఆలోచనను ప్రచారం చేసేందుకు గతేడాది డిసెంబరు చివరి వారంలో బిజెపి 25 వెబినార్లు నిర్వహించింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక వుండాల్సిన అవసరంపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో బిజెపి ఈ వెబినార్లు నిర్వహించింది. రాజ్యాంగ దినోత్సవమైన నవంబరు 26న 80వ ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో తాజాగా మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ బిజెపి వెబినార్లలో పలు వాదనలు వినిపించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద మొత్తంలో ధనం ఆదా అవుతుందని, పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఫలితంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని, తద్వారా అధికారుల దృష్టి మళ్లడానికి అవకాశం వుంటుందని ఇలా పలు వాదనలను తీసుకొచ్చారు. ఒక వెబినార్‌లో బిజెపి ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ''ఎన్నిక అనేది ప్రజాస్వామ్యానికి ఒక మార్గం వంటిది, కానీ పలుసార్లు ఎన్నికలు నిర్వహించడం వల్ల అది కేవలం ప్రజాస్వామ్య లక్ష్యంగా మాత్రమే మారిపోవడం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
పాలన వెనుకపడుతుంది
పలుసార్లు ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి మరీ ముఖ్యంగా పాలనకు మంచిది కాదన్నది ఇందులో అంతర్లీనంగా వున్న సందేశం. రైతుల పోరాటానికి సంబంధించి భారత్‌లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువై పోయిందని నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించడానికి అనుగుణంగానే పై వ్యాఖ్యలు వున్నాయి. 'ఒక దేశం, ఒకే ఎన్నిక' అన్న పిలుపు అంతిమంగా 'ఒక దేశం, ఒక నేత'కు దారి తీస్తుంది. పైగా, ఇది చర్చించాల్సిన అంశం కాదని, భారత దేశానికి అవసరమైన అంశమని ఆ నేత ప్రకటించేశారు కూడా.
అన్ని స్థాయిల్లో కలిసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం (స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి ఎన్నికలతో కలిసి నిర్వహించాలని కొంతమంది బిజెపి నేతలు కోరుతున్నారు), అందుకు రాజ్యాంగపరంగా అవసరమైన మార్పులు తీసుకురావడం వల్ల మౌలికంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వభావమే మారిపోతుంది, దేశంలో ఫెడరలిజం నాశనమైపోతుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న ప్రతిపాదన చట్టసభకు ప్రభుత్వం జవాబుదారీని చేస్తున్న రాజ్యాంగ నిబంధనను మార్చాల్సి వుంటుంది. రాజ్యాంగం ప్రకారం, అవిశ్వాస తీర్మానం నెగ్గినా లేదా ద్రవ్య బిల్లుపై ఓడిపోయినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వుంటుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనపుడు చట్టసభను రద్దు చేస్తారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభకు లేదా రాష్ట్రాల అసెంబ్లీలకు కచ్చితంగా స్థిరమైన పదవీ కాలాన్ని రాజ్యాంగంలో పొందుపరచలేదు.
2017లో చర్చా పత్రంలో, 2018లో లా కమిషన్ ముసాయిదా నివేదికలో నీతి ఆయోగ్ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతమున్న రాష్ట్ర అసెంబ్లీల్లో కొన్నింటి పదవీ కాలాన్ని తగ్గించడానికి లేదా పొడిగించడానికి ఉద్దేశించినవే ఈ ప్రతిపాదనలన్నీ. అలా తగ్గించడం లేదా పొడిగించడం వల్ల లోక్‌సభ ఎన్నికలతో కలిపి వాటిని నిర్వహించడానికి లేదా ఐదేళ్ల పదవీ కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఎన్నికలు నిర్వహించడానికి వీలు వుంటుందన్నది ఆ ప్రతిపాదనల సారాంశం. అసెంబ్లీ కాలపరిమితిని తగ్గించడం లేదా పొడిగించడం ఈ రెండు చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవే. పైగా శాసనసభ్యులను ఎన్నుకునేందుకు పౌరులకు గల మౌలిక హక్కులను ఇది ఉల్లంఘించడమే.
సభను పదవీ కాలం మధ్యలోనే రద్దు చేయడం, తదనంతరం ఎన్నికలు నిర్వహించడాన్ని నివారించేందుకు పదవీ కాలాన్ని స్థిరంగా నిర్దేశిస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా వుంటాయి. లోక్‌సభ రద్దును నివారించలేనపుడు, మిగిలిన పదవీకాలం ఎక్కువగా లేకపోయినపుడు తదుపరి లోక్‌సభను ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి తాను నియమించిన మంత్రిమండలి సలహాలు, సూచనలతో దేశ పాలనా వ్యవహారాలు సాగించవచ్చనేలా నిబంధన రూపొందించవచ్చని నీతి ఆయోగ్ పత్రంలో చేసిన ఒక ప్రతిపాదన పేర్కొంటోంది. ఈ దారుణమైన ప్రతిపాదన రాష్ట్రపతిని ప్రభుత్వ అధినేతగా చేస్తుంది. ఇది దొడ్డిదారిన కార్య నిర్వాహక అధ్యక్షుడిని తీసుకురావడమే. రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి కూడా ఇదే వైఖరిని సూచించారు. అక్కడ గవర్నర్ స్వల్ప కాలానికి పాలనా పగ్గాలు చేపట్టవచ్చు.
స్థిరమైన పదవీ కాలాన్ని నిర్దేశించడమంటే సభలో సుస్థిరమైన మెజారిటీ వున్న పాలక పార్టీ సభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు సిఫార్సు చేయలేదు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, ఆ వెనుకే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు కొత్త నేత పేరును పేర్కొంటూ తీర్మానాన్ని చేయాల్సి వుంటుందని లా కమిషన్ నివేదికలో ప్రతిపాదించారు. దీన్ని 'నిర్మాణాత్మకమైన అవిశ్వాసపు ఓటు' అని పేర్కొన్నారు. అంటే, సభ లోని సభ్యులు ప్రభుత్వాన్ని తొలగించినప్పటికీ ఏదో రకమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వం వుంటుంది. లేదా ప్రజల అభీష్టానికి ఏమాత్రమూ ప్రాతినిధ్యం వహించని విధంగా సంకీర్ణ ప్రభుత్వమైనా వుంటుందని అర్ధం. ఇక్కడ స్థిరమైన పదవీకాలాన్ని నిర్దేశించడం ద్వారా సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఓటర్ల అభిప్రాయాలు, వారి ఎంపికలకు అస్సలు ప్రాధాన్యతే ఉండదు. ఇటువంటి వ్యవస్థలో రాష్ట్ర చట్టసభలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రీకృతమైన నియంత్రణ ఏర్పాటవుతుంది. ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయిన పక్షంలో సభను రద్దు చేసే అధికారాలను కత్తిరించిన తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఐదేళ్ళ నిర్దిష్ట కాలపరిమితి అవసరమవుతుంది. ఇటువంటి ప్రభుత్వం గవర్నర్ ఆలోచనలు, నిర్ణయాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన నాయకుడు ఎవర్నది గవర్నర్ నిర్ణయించాల్సి వుంటుంది. ఎన్నికలను ఎదుర్కొంటామన్న భయం లేకుండా చట్టసభల సభ్యులు అటూ ఇటూ పార్టీలు మారడానికి ఈ నిర్దేశిత కాలపరిమితి ఒక లైసెన్స్‌గా మారుతుంది.
జగ్‌దీప్ ధన్‌కర్, భగత్ సింగ్ కొషాయిరి, అరిఫ్ మహ్మద్ ఖాన్ వంటి గవర్నర్లు వున్నపుడు కేంద్రం తరపున ఏజెంట్లుగా వ్యవహరించినపుడు ఎటువంటి గందరగోళం నెలకొంటుందో ఎవరైనా ఊహించవచ్చు.
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను తీసుకొచ్చేందుకు రాజ్యాంగపరంగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయాల్సి వుంటుంది. రాజ్యాంగంలోని 85వ అధికరణ (లోక్‌సభ రద్దు), 172వ అధికరణ (రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి), 174వ అధికరణ (రాష్ట్ర అసెంబ్లీ రద్దు), 356వ అధికరణ (రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం)లకు సవరణలు చేయాల్సి వుంటుంది. ఇవికాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, ఇతర నిబంధనలకు సవరణలు చేయాల్సి వుంటుంది. 2014లో తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటి నుండి బిజెపి ప్రతిసారి 'ఒక దేశం, ఒక ఎన్నిక' అన్న ఆలోచనను తెర పైకి తెస్తూనే వుంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇరువురు కూడా ఈ భావనను సమర్ధించారు.
బిజెపి ప్రస్తుతం సాగిస్తున్న ప్రచారం, దీనిపై పెట్టిన దృష్టి చూస్తుంటే ఈ దిశగా చాలా తీవ్రమైన కృషే చేస్తోందని అర్ధమవుతోంది. రాజ్యాంగ సవరణలు, మార్పులు పాలక పార్టీ నిరంకుశత్వ చర్యలకు ప్రధాన అవరోధాలుగా నిలుస్తాయని ఆలోచించడం పెద్ద తప్పు కాగలదు. 370వ అధికరణను రద్దు చేయడానికి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి రాజ్యాంగబద్ధంగానే ప్రయత్నించడం మనం చూశాం. మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తుందో ప్రతిపక్షానికి తెలియదు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వుండాలి. 370వ అధికరణ రద్దుపై కాంగ్రెస్ ఊగిసలాట ధోరణిని బిజెపి పూర్తిగా సొమ్ము చేసుకుంటోంది.
ఈ నిరంకుశ 'ఒక దేశం, ఒక ఎన్నిక' పథకం వల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. ప్రధానంగా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలే. రాష్ట్ర ప్రభుత్వానికున్న పరిమిత అధికారాలు పోతాయి. గతంలో మాదిరిగా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం లేదా అసెంబ్లీ ఎన్నికలకు తమదైన రాజకీయ ఎజెండా రూపొందించుకోవడం వంటి ప్రజాస్వామ్య నిబంధనల ప్రక్రియ గాలికిపోతుంది. దాని స్థానంలో అసెంబ్లీ ఎన్నిక అంటే పార్లమెంట్‌కు నిర్వహించే కేంద్ర ఎన్నికగా మారిపోతుంది.
ఒడిషా లోని బిజూ జనతాదళ్, తెలంగాణ లోని టిఆర్‌ఎస్, ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్‌ఆర్‌సిపి వంటి పార్టీలు అవకాశవాదం, ఆధిపత్యం కారణంగా మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులపై ఇటువంటి అనేక దాడులకు దిగుతోంది. ఆయా ప్రభుత్వాలు వెంటనే మేల్కొని, ఈ నిరంకుశమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన, ఫెడరల్ వ్యతిరేకమైన చర్యను తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ పార్టీలు మిగిలిన ప్రతిపక్షంతో చేతులు కలిపితే బిజెపి దుర్మార్గపు చర్యలను ఓడించగలుగుతాం.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)










