Jan 30,2021 20:45

బెంగళూరు : కర్ణాటకకు చెందిన జనతాదళ్‌ సెక్యులర్‌(జెడిఎస్‌) నాయకత్వంపై ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోంది. ఇందుకు బిజెపితో ఆపార్టీ నాయకత్వం అనుసరిస్తున్న సాన్నిహిత్య వైఖరే కారణంగా కనిపిస్తోంది. మతతత్వ బిజెపికి దగ్గరిగా జరగడంపై పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీకి వున్న 34 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజెపి నేత యడియూరప్పతో మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్‌ నేత కుమారస్వామి సన్నిహిత సంబంధాలు నెరపడంపై ఐదు నుంచి ఆరుగురు ఇప్పటికే పార్టీకి దూరంగా ఉన్నారు. ఎటువంటి సంక్షోభ సమయంలోనైనా బిజెపికి అండగా ఉండేందుకు కుమారస్వామి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
అదేవిధంగా మాజీ ప్రధాని, జెడిఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడపై పలువురు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్ర కౌన్సిల్‌ చైర్మన్‌ పదవికి పార్టీకి వచ్చేలా చేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను వారు వ్యతిరేకిస్తున్నారు. చైర్మన్‌ పదవి విషయమై దేవెగౌడ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డాతో కూడా సమావేశమై చర్చించారు. చైర్మన్‌ పదవి గనుక జెడిఎస్‌కు ఇస్తే.. డిప్యూటీ చైర్మన్‌ పదవి బిజెపికి వచ్చేలా తమ పార్టీ మద్దతు ఇస్తుందని దేవెగౌడ తెలియజేశారు. ఇందులో భాగంగా శుక్రవారం జరిగిన కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బిజెపి తరపున బరిలో నిలిచిన ఎంకె.పర్నేష్‌కు జెడిఎస్‌ మద్దతు ఇచ్చింది. పర్నేష్‌కు పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌వాదిగా పేరుంది. జెడిఎస్‌ మద్దతుతో పర్నేష్‌కు 41 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండయ్యకు24 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాము గెలవమని తెలిసినా కాంగ్రెస్‌ అభ్యర్ధిని బరిలో నిలపడం గమనార్హం. బిజెపి-జెడిఎస్‌ కలయికతో పాటు సెక్యులర్‌గా చెప్పుకుంటున్న జెడిఎస్‌ వైఖరిని బయటపెట్టేందుకు తాము పోటీచేసినట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.
కేంద్రం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు జెడిఎస్‌ ఇప్పటికే మద్దతు తెలిపింది. అదేవిధంగా రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకురానున్న ఆవు వధ వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇవ్వనుంది. అయితే బిజెపితో తమ పార్టీ 'హనీమూన్‌' కౌన్సిల్‌ చైర్మన్‌ పదవి వరకే పరిమితం అవుతుందని, బిజెపికి దూరంగా ఉంటామని, అవసరమైన సమయంలో రాజకీయంగా వ్యతిరేకిస్తామని దేవెగౌడ చెప్పుకొచ్చారు.