తిరుపతి బ్యూరో: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్సాహంగా ఉన్న జనసేన క్యాడర్‌లో నిస్తేజం నెలకొంది. రెండు నెలల వ్యవధిలోనే మూడుసార్లు తిరుపతికి వచ్చిన పవన్‌కల్యాణ్ అభ్యర్ధిత్వంపై ఎటూ తేల్చకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు కినుకు వహిస్తున్నాయి. బిజెపి కంటే తమకే నియోజకవర్గంపై బలం ఉందని, క్యాడర్ లేని ఆ పార్టీకి పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని బలంగానే పట్టుబట్టినట్లు తెలుస్తోంది. అయితే పవన్ మాత్రం 'వారం రోజులు ఆగండి, అన్నీ సర్దుకుంటాయి' అని బుజ్జగించినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రెండు రోజుల పర్యటనలో తిరుపతికి విచ్చేశారు. గురువారం తిరుపతి పార్లమెంట్ ఎన్నికపై అంతర్గత సమావేశం నిర్వహించారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల మనమే పోటీ చేయాలని జనసేన శ్రేణులు గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీంతో స్పందించిన పవన్‌కల్యాణ్ బిజెపికి ఉన్నంత బలం మనకు లేదని శ్రేణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అధినేతే ఆ విధంగా మాట్లాడటంతో క్యాడర్ పూర్తిగా నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం. తమ అధినేత మూడుసార్లు పర్యటించినా తమకు ఒరిగిందేమీ లేదన్న బాధ వారిలో కనిపిస్తోంది. పొత్తు ఉన్నప్పటికీ బిజెపి తిరుపతిలో పదుల సంఖ్యలో సమావేశాలు నిర్వహించిందని, మిత్రపక్షమైన జనసేనకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. అయితే శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరన్నది వారంలో ప్రకటిస్తామని, ఎవరు పోటీ చేసినా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లా కలిసి పని చేస్తాం' అని చెప్పారు. బిజెపి అధినేతలను ఒప్పించి తామే పోటీలో ఉంటారా? లేక బిజెపికి వదిలేస్తారా? అన్నది మళ్లీ సందిగ్ధమే.










