Feb 05,2021 06:36

మోడీ ప్రభుత్వ 2021-22 బడ్జెట్‌ చూసిన తరువాతైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు బిజెపి కేంద్ర ప్రభుత్వం పట్ల తమ వైఖరి మార్చుకోవడం...ఆ పార్టీలకు, రాష్ట్రానికి, దేశానికి కూడా మంచిది. రాష్ట్ర ప్రజలతో సహా దేశ ప్రజలందరూ స్వాతంత్య్రానంతరం కష్టపడి సమకూర్చుకున్న...పరిశ్రమలు, అంతరిక్షం, ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలు, రైలు, రోడ్డు, ఇన్సూరెన్స్‌, బ్యాంకులు ఒకటేమిటి సర్వం...తన కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెట్టే బడ్జెట్‌ బిజెపి ప్రభుత్వం పెట్టింది. ఖనిజ సంపదలతోపాటు ప్రభుత్వ భూమి మొత్తం కార్పొరేట్లకు దఖలుపర్చే విధానం పొందుపర్చింది. దేశ నిర్మాణంలో వీసమెత్తు పాత్ర లేని బిజెపి మన ప్రజల సంపద కార్పొరేట్లు పరం చేయడాన్ని 'ప్రజల కోసం పని చేస్తున్నా'మంటున్న రాజకీయ పార్టీలు ఎలా అంగీకరిస్తాయి?
కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుందనే భావన బడ్జెట్‌ లో ఎక్కడా కనిపించదు. తన ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలకే నిధులు, ప్రాజెక్టులను కేటాయించింది.
రాష్ట్రం హక్కులపై బిజెపి దాడి
ఇప్పటికే రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయాన్ని కేంద్రం స్వాధీనం చేసుకొని దేశవిదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా మూడు వ్యవసాయ చట్టాలు చేసింది. మా హక్కు నువ్వెలా లాగేసుకుంటావని ఎదురు తిరగకుండా వైసిపి, టిడిపి రెండు పార్టీలూ బలపర్చాయి. బడ్జెట్‌లో రాష్ట్ర పరిధి లోని విద్యుత్తు ప్రైవేటీకరణను మోడీ ప్రభుత్వం ప్రతిపాదించింది. చట్టం కాక ముందే మోడీ విద్యుత్‌ విధానాన్ని వైసిపి ప్రభుత్వం అంగీకరించడం ఏమాత్రమూ సమంజసం కాదు.
ఈ బడ్జెట్‌లో కేంద్రం ఆహార సబ్సిడీ తగ్గించేసింది. ఆ మేరకు రాష్ట్రాలు అదనపు సబ్సిడీ భారం మోయాలి. లేదా ప్రజలపై వేయాలి. ప్రజలపై వేస్తే... కోవిడ్‌ వలన ఉపాధి కోల్పోయి, ఆదాయం కోల్పోయిన ప్రజలు భరించలేరు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయి అప్పుల్లో దిగబడి వుంది. ఈ పరిస్థితుల్లో సబ్సిడీ భారాన్ని మోయడం రాష్ట్రానికి భారమే.
సెస్సులు, సర్‌చార్జీలు- రాష్ట్రం ఆదాయానికి గండి
ప్పటికే రాష్ట్రానికి రావలసిన జిఎస్‌టి పరిహారాన్ని ఎగ్గొట్టిన బిజెపి ఇప్పుడు రాష్ట్రాలకు పన్నుల రూపంలో సమకూరే ఆదాయానికి గండి కొడుతోంది. పన్ను రేటు పెంచితే అందులో రాష్ట్రానికి వాటా ఇవ్వాలి. అలాగాక సెస్‌, సర్‌చార్జి విధిస్తే అదంతా కేంద్రం ఖాతాకి పోతుంది. గత సంవత్సరం ఆ విధంగా 42 సెస్సులు, సర్‌చార్జీలు వేసింది. ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం వేసి రాష్ట్రాలకు వాటా ఎగ్గొట్టింది. ఈ బడ్జెట్లో కూడా పెట్రోల్‌, డీజిలుపై సెస్సు వేసింది.
రాష్ట్రానికి బిజెపి ప్రత్యేక ద్రోహం
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ లో కూడా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్రం మాటే బడ్జెట్‌ లో ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా లేదు. కడప స్టీల్‌ప్లాంట్‌ లేదు. దుగ్గరాజపట్నం పోర్టు లేదు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ లేదు. కేంద్ర విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు లేవు. రాజధాని నిర్మాణానికి నిధులు లేవు. విభజన వలన మన రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టానికి భర్తీ లేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరంకు నిధుల ప్రస్తావనే లేదు. నిర్వాసితులు గిరిజనులు, గిరిజనేతరులు లక్ష పైన కుటుంబాల పునరావాసం బాధ్యత కేంద్రానికి లేదనే బిజెపి వైఖరే ఈ బడ్జెట్‌లో కనపర్చింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక నిధుల ప్రసక్తే లేదు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. ఇపుడైనా వైసిపి, టిడిపి రెండు పార్టీలు బిజెపి పట్ల తమ వైఖరిని పునరాలోచన చేయవా?
అమ్మకానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కని నినదించి, ముక్కోటి ఆంధ్రులు పోరాడి, 32 మంది వీరమరణం పొంది, 65 మంది కమ్యూనిస్టు శాసన సభ్యులు రాజీనామాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని క్యాబినెట్‌ సబ్‌కమిటీ తాజాగా అమ్మకానికి పెట్టింది. కడపకు అదనంగా స్టీల్‌ప్లాంట్‌ ఇవ్వాలని మనం అడుగుతుంటే అది ఇవ్వలేదు సరికదా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను అమ్మకానికి పెట్టడం దారుణం. దీనిని రాష్ట్రం లోని ప్రధాన పార్టీలు రెండూ వ్యతిరేకించడం లేదు. ఇక ఈ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే వున్నాయని విశ్వసించడమెలా?
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలిపేది ఇలాగేనా?
కేంద్ర పెత్తనంపై పోరాటం నుంచే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. టిడిపి ఏర్పడిన తర్వాత కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడింది. జ్యోతిబసు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్‌ అబ్దుల్లా, బిజూ పట్నాయక్‌, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ తో కలిసి ఎన్‌టి రామారావు రాష్ట్రాల హక్కులకై పోరాడారు. ఫలితంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, హక్కులు, బాధ్యతలపై సిఫార్సుల కోసం సర్కారియా కమిషన్‌ నియమించడం జరిగింది. సర్కారియా కమిషన్‌ సిఫార్సులు తుంగలో తొక్కి బిజెపి అడ్డగోలుగా రాష్ట్రాల హక్కులు హరించేస్తుంటే తెలుగుదేశం ప్రశ్నించడం మానేసి బిజెపి తీసిన గోతిలో పడుతున్నది. బిజెపి ప్రజల దృష్టి మళ్లించేందుకు మతపరమైన వివాదాలు రేకెత్తిస్తున్నది. బిజెపి నోరు విప్పితే అబద్ధాలే. చేసేదంతా మోసమే. ఈ మోసంపై, అబద్ధాలపై పోరాడకుండా బిజెపి భాష లోనే టిడిపి మాట్లాడడం వెనక అర్ధం ఏమిటి? వివిధ మతాల తెలుగు వారందరి ఐక్యత కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నిలిచే తీరిదేనా?
వైసిపి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి
కాంగ్రెస్‌ పెత్తనానికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన జగన్‌ మోహన్‌ రెడ్డి తాను అధికారం లోకి వస్తే, తన పార్టీకి 25 ఎం.పి సీట్లు ఇస్తే కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల్లో చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు. గద్దెనెక్కి ప్రత్యేక హోదా తేకపోగా బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం హక్కులు కాజేస్తుంటే ఎదిరించడం లేదు. కేంద్రంపై పోరాడుతున్న రాష్ట్రాలతో కలిసి వెళ్లకుండా రాష్ట్రానికి హాని చేస్తున్న మోడీతో చెట్టపట్టాలు వేసుకొని వ్యవహరించడం వైసిపి కి, రాష్ట్రానికి మేలు జరగడం లేదు. కీడు జరుగుతున్నది. ఇప్పటికైనా వైసిపి, టిడిపి రెండు పార్టీలు తమ వైఖరి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు పూనుకోవాలి. కలిసి వచ్చే శక్తులను కలుపుకొని బిజెపి నుండి రాష్ట్ర ప్రయోజనాలు, దేశాన్ని కాపాడాలి.
                                                                 బిజెపి ద్రోహం..వైసిపి, టిడిపి మౌనం..    ఎం. కృష్ణమూర్తి (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)