Feb 06,2021 06:54

ప్రజారోగ్య రంగం పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిన తీరు ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ప్రతిబింబించింది. ఆరోగ్యం, స్వస్థతకు బడ్జెట్‌ కేటాయింపులు 137 శాతం పెంచామని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకోవడం మరింత అధ్వాన్నమైన అంశం. నిజానికి ఈ మోసం కూడా చాలా వినూత్నంగా వుంది.
     కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా వుందో స్పష్టమైన తర్వాత...ఆ పరిస్థితుల నుండి ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంటుందని ఎవరైనా భావిస్తారు. భారతదేశం ప్రజారోగ్యంపై పెట్టే వ్యయం ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా అత్యంత తక్కువ. 2019లో ఇది జిడిపి లో కేవలం 1.3 శాతంగా వుంది. ఆరోగ్య రంగ సర్వీసులను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. 1991లో సరళీకరణ విధానాలతో కొంత ప్రారంభమైంది. ప్రైవేటు రంగ ప్రాబల్యం వున్న చోట (కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు, డయాగస్టిక్‌ సెంటర్లు) ఆరోగ్య వ్యవస్థ వృద్ధి చెందింది. వీటిలో చాలా సంస్థలు అసాధారణమైన రీతిలో ఫీజులు వసూలు చేస్తాయి. కేవలం లాభాలు గడించడమనే సిద్ధాంతం ప్రాతిపదికనే నడుస్తాయి. దీనికితోడు అసలే అరకొర నిధులతో నడిచే ప్రజార్యోగ సంస్థల నెట్‌వర్క్‌కు సిబ్బంది కొరత, నాణ్యత లేని సేవలు అందుతాయి. ఫలితంగా, మొత్తం వ్యయంలో 62 శాతం ఈ వైద్య ఖర్చులే సరిపోతాయి. ఇది, పేదలు, మధ్య తరగతి వర్గాల మీద పెను భారం మోపుతోంది.
    ఇటువంటి ఆరోగ్య వ్యవస్థ నెలకొన్న దేశంలో కనివినీ ఎరుగని రీతిలో కోవిడ్‌ మహమ్మారి సవాళ్లు విసిరింది. ఇప్పటికీ, ప్రపంచలోనే అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో భారత్‌ వుంది. మరణాలు సంభవించిన కేసుల్లో మూడవ స్థానంలో వుంది. వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ మహమ్మారి బాగా తీవ్రంగా నెలకొన్నందున ప్రభుత్వ ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. అక్కడ పని చేసే ఆరోగ్య సిబ్బందికి పిపిఇ పరికరాలు లేవు. పైగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, నిఘా కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్‌ సిబ్బంది ఉత్తమ సేవలు అందించడానికే తీవ్రంగా కృషి చేశారు. గత నెల రోజులుగా దేశంలో కోవిడ్‌ కేసులు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. అయినా యూరప్‌లో మాదిరిగా ఇక్కడ కూడా సెకండ్‌ వేవ్‌ వస్తుందని భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజారోగ్యం నిర్లక్ష్యానికి గురవుతోందని గుర్తించి, ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి, చర్యలు తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టింది. భారత్‌లో వైరస్‌ను ఎంత సమర్ధవంతంగా అదుపు చేశామో ప్రచారం చేసుకుంటోంది. ప్రజారోగ్య రంగం పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిన తీరు ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ప్రతిబింబించింది. ఆరోగ్యం, స్వస్థతకు బడ్జెట్‌ కేటాయింపులు 137 శాతం పెంచామని మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పుకోవడం మరింత అధ్వాన్నమైన అంశం. నిజానికి ఈ మోసం కూడా చాలా వినూత్నంగా వుంది.
    బడ్జెట్‌ ప్రసంగ పాఠంతో పాటుగా ఇచ్చిన అనుబంధ పత్రంలో పేర్కొన్న గణాంకాలను చూసినట్లైతే, ఇదంతా కేవలం బూటకం తప్ప మరేమీ కాదని స్పష్టమవుతోంది. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ.69,234 కోట్లను అందచేశారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు, ఆర్యోగ రంగ పరిశోధనలకు చేసిన కేటాయింపులన్నీ ఇందులోనే వున్నాయి. ఈ పద్దులపై సవరించిన అంచనాల ప్రకారం 2020-21 సంవత్సరానికి వాస్తవ వ్యయం రూ.85,250 కోట్లుగా వుంది. కానీ, 2021-22 సంవత్సరానికి ప్రస్తుత బడ్జెట్‌ అంచనాల్లో ఈ పద్దులకు మొత్తం కేటాయింపులు రూ.76,902 కోట్లుగా వుంది. గతేడాది ఖర్చు పెట్టిన వాస్తవ వ్యయాల కన్నా ఈసారి 11 శాతం తక్కువ కేటాయింపులు జరిగాయన్నది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్ధమవుతున్నది.
    'ఆరోగ్యం, స్వస్తతకు రూ.2,23,846 కోట్లు కేటాయించడాన్ని నిశితంగా పరిశీలించినట్లైతే ఇందులో అమలు చేసిన కపటోపాయం వెల్లడవుతుంది. ఆరోగ్య, సంక్షేమం, ఆయుష్‌, ఆరోగ్య రంగ పరిశోధన కేటాయింపులతో పాటు తాగు నీరు, పారిశుధ్యానికి కేటాయించిన రూ.60 వేల కోట్లు ఇందులో కలిపి చూపించారు. అలాగే, తాగునీరు, పారిశుధ్యానికి ఆర్థిక సంఘం గ్రాంట్‌ రూ.36 వేల కోట్లు, పోషకాహారానికి రూ.2,700 కోట్లు కేటాయించింది (వాస్తవానికి ఈసారి పోషకాహారానికి గతేడాది కన్నా 30 శాతం తక్కువగా కేటాయించారు).
   పైగా, ఆరోగ్య రంగానికి రూ.13,192 కోట్లను గ్రాంట్‌గా ఇవ్వడానికి, వ్యాక్సిన్ల కోసం రూ.35 వేల కోట్లను ఒకసారిగా కేటాయించడానికి ఆర్థిక సంఘం కట్టుబడి వుంది. అయితే వ్యాక్సిన్‌ రవాణా, నిల్వ, టీకాలు వేయడానికి అవసరమైన ఇతర సామగ్రిని పరిగణన లోకి తీసుకోకుండానే దాదాపు 70 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి అయ్యే వ్యయం కూడా ఇందులోనే వుంది. ఒకవేళ వ్యాక్సిన్ల సరఫరాకయ్యే వ్యయాన్ని సైతం ఇందులో చేర్చినట్లయితే అప్పుడు ఆ మొత్తంతో కేవలం 40 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయగలరు. రాష్ట్రాలతో ఈ వ్యయాలను ఎలా పంచుకుంటుందన్నది కేంద్రం ఇంతవరకు వెల్లడించలేదు. ఏది ఏమైనా ఈ కేటాయింపులు చూసినట్లైతే ఉచితంగా సార్వజనీన టీకా కార్యక్రమానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. ఇక ఆరోగ్య రంగ బడ్జెట్‌లో గుర్తించాల్సిన మరో అంశం ఏమంటే, కేంద్ర ప్రభుత్వ కొత్త ప్రాయోజిత పథకం 'ఆత్మ నిర్భర్‌ స్వస్థ్య భారత్‌ యోజన' ప్రకటించడం. జాతీయ ఆరోగ్య మిషన్‌ బడ్జెట్‌కు అదనంగా ఈ పథకానికి ఆరేళ్ళలో రూ. 64,180 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రాథమిక, మాథ్యమిక, తృతీయ ఆరోగ్య వ్యవస్థలలో సామర్ధ్యాలను అభివృద్ధి పరచడం, వైద్య పరిశోధనా ప్రయోగశాలలను, ఇతర ప్రజారోగ్య సదుపాయాలను ఆధునీకరించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే, ఈ బడ్జెట్‌లో ఈ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. కేవలం ప్రకటన మాత్రమే చేశారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో దీని అమలు వుండదని స్పష్టమవుతోంది.
    ప్రజారోగ్యం పట్ల ఇంతటి దారుణమైన వైఖరి ప్రదర్శించడమంటే ప్రైవేటీకరణే అన్ని రుగ్మతలకు పరిష్కార మార్గమని దృఢంగా విశ్వసించడమేనని తేటతెల్లమవుతోంది. ఈ దృక్పథం మొత్తంగా బడ్జెట్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ విభాగాలను, ఆర్థిక సంస్థలను పెద్ద ఎత్తున ప్రైవేటీకరించడానికి ఈ బడ్జెట్‌లో చర్యలు చేపట్టారు.
   ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని ప్రస్తుతమున్న జిడిపి లో 1 శాతం నుండి 2.5-3 శాతానికి పెంచాలని ఆర్థిక సర్వే సూచించింది. కానీ కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఈ కోణం నుండి చూసినట్లైతే తిరోగమన దశలో వున్నాయి. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రజా కోణంలో చూడాల్సిన అవసరాన్ని... దాన్ని ప్రజాస్వామ్య, రాజకీయ శక్తులన్నీ తమ రాజకీయ ఎజెండాలో ప్రాధాన్యతాంశంగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను...ఈ ఆరోగ్య రంగ బడ్జెట్‌ నొక్కి చెబుతోంది.
 

('పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం)