హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణం తీసింది. అచ్చంపేట దర్శన్ గడ్డ తండాకు చెందిన రోజా నిండు గర్భిణి.. 15వ తేదీన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేరోజు రోజాకు వైద్యులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. అయితే, ఆపరేషన్ పూర్తయ్యాక కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు కడుపు నొప్పితో ఇబ్బంది పడగా.. ప్రసవం వల్ల కలిగిన నొప్పులని అంతా భావించారు. అయితే, డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్నాక కూడా నొప్పి తగ్గకపోగా రోజా తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఈ నెల 22న మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడి నుంచి ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లగా.. రోజా పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ కు తీసుకెళ్లాలని ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్ కు తీసుకొచ్చి ఓ దీ చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రోజా చనిపోయింది. కడుపులోని దూది వల్లే రోజా మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అచ్చంపేటకు తరలించిన రోజా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రి ముందు డెడ్ బాడీతో ఆందోళనకు దిగారు.