Oct 09,2023 21:01

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : మత్తు వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవాడ ఇఎస్‌ఐ (కార్మిక బీమా) ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఉప్పులేటి తారక ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగిన మత్తు వైద్యుల సంఘం 32వ వార్షిక సదస్సులో సుమారు వెయ్యి మందికిపైగా మత్తు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఉప్పులేటి తారక ప్రసాద్‌ (విజయవాడ), రాష్ట్ర కార్యదర్శిగా డాక్టర్‌ అచ్యుతరామయ్య (కాకినాడ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ రామారావు (విజయనగరం), ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా డాక్టర్‌ సూరిశెట్టి శ్రీనివాస్‌ (తిరుపతి), ట్రెజరర్‌గా డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ (అమలాపురం) ఎన్నికయ్యారు. ఎన్నికైన కమిటీని మత్తు వైద్యుల సంఘం జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ వంకినేని కుచేలబాబు ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్‌ ఉప్పులేటి తారక ప్రసాద్‌తోపాటు నూతన కార్యవర్గాన్ని ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఎనస్తీషియా జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ కె.ఆర్‌.ఎన్‌.ఠాగూర్‌, డాక్టర్‌ ఎ.కామేశ్వరరావు, ఐఆర్‌సిఎఫ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌సి చక్రరావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఆళ్ల ప్రశాంతి, విశాఖపట్నం బ్రాంచి అధ్యక్షులు డాక్టర్‌ అల్లు పద్మజ, నేషనల్‌ పెస్ట్‌ జిసి సభ్యులు డాక్టర్‌ జి.కిరణ్‌కుమార్‌, సిద్ధార్థ వైద్య కళాశాల ఎనస్తీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎస్‌. వినయకుమార్‌ తదితరులు అభినందించారు.