Oct 16,2023 20:45

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : వైద్యులపై రోజురోజుకూ భౌతిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు ప్రభుత్వం పటిష్టమైన రక్షణ చట్టం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర ఐఎంఎ జిల్లా శాఖల సమావేశాలల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారం ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వచ్చే నెలలో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న విజయనగరానికి చెందిన డాక్టర్‌ జెసి నాయుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్‌ విఎస్‌. ప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. రవికృష్ణ మాట్లాడుతూ.. ఐఎంఎ అంటే ప్రయివేట్‌ వైద్యులసంఘం అనే అపోహ ఉందని, కానీ తమ సంఘం సభ్యులు ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రులలో, వైద్య కళాశాలలో సేవలు అందిస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, వైద్యులపైనా భౌతికదాడులు పెరిగిపోతున్నాయని, వాటిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ వైద్యరక్షణ చట్టంలో సవరణలు చేసి కనీస కారాగార శిక్ష ఏడేళ్లకు మార్చి పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆస్పత్రులు ఏర్పాటు చేసే సమయంలో ఉన్న వివిధ అనుమతులు, లైసెన్సులు ఏకగవాక్ష విధానంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ వర్తింపజేసేందుకు 50 పడకల నియమాన్ని సడలించి 20 పడకల వసతి కలిగిన ఆస్పత్రులకు సైతం అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్య సంబంధమైన కీలక నిర్ణయాలు తీసుకునే సమయాల్లో ఐఎంఎను సంప్రదిస్తే మెరుగైన సేవలు అందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డాక్టర్‌ విఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. అర్హత, శిక్షణలేని వైద్యచికిత్సలను నిరోధించాలని డిమాండ్‌ చేశారు.