Aug 16,2023 14:20
  •  తీవ్ర కడుపునొప్పితో తిరిగి బాధితురాలు ఆస్పత్రికి
  •  విషయం బయటకు పొక్కడంతో విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, అర్భన్‌ : గర్భిణికి ఆపరేషన్‌ చేసి బిడ్డను తీసిన వైద్యులు కడుపులో ఫోర్‌సెప్స్‌ (కత్తెర) వదిలేసి కుట్లువేసిన ఘటన ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితురాలు ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్‌ 19న పెదపాడు మండలం ఎస్‌ కొత్తపల్లి గ్రామానికి చెందిన జి స్వప్న ప్రసవం కోసం ఏలూరు సర్వజన ఆస్పత్రిలో చేరారు. ఆమెకు సిజేరియన్‌ చేసిన వైద్యులు బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయ్యాక ఆమె ఇంటికి వెళ్లిపోయారు. ఆ తరువాత అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుండేది. సాధారణ నొప్పి అనుకొని మందులు వాడేవారు. ఈ నెల 8న విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అత్యవసర కేసుగా పరిగణించి విజయవాడ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా ఆమె కడుపులో కత్తెర ఉందని, పేగు కుళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రసవం సమయంలో ఏలూరు ఆస్పత్రి వైద్యులు కడుపులో కత్తెర ఉంచి ఆపరేషన్‌ చేశారని నిర్ధారించారు. విజయవాడ ఆస్పత్రిలో ఆమెకు ఆపరేషన్‌ చేసి కుళ్లిపోయిన పేగును, కత్తెరను తీసేశారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితురాలు క్షేమంగా ఉన్నట్లు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు : సూపరింటెండెంట్‌

ఆపరేషన్‌ సమయంలో కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసిన మాట వాస్తవమని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం శశిధర్‌ తెలిపారు. ఏలూరు బోధన ఆస్పత్రిలో సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ పద్మ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ సిజేరియన్‌ చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం సర్జరీకి వెళ్లేముందు సర్జరీకి ఉపయోగించిన పరికరాలు లెక్క చూసుకొని రాసుకోవాలని, సర్జరీ తర్వాతా మరోసారి లెక్క చూసుకుని అన్నీ వచ్చాయో, లేదో చూసుకోవాలన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ విచారణ కమిటీని నియమించారన్నారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారనితెలిపారు. ఇకముందు ఇలాంటివి జరగకుండా సర్జరీ సమయంలో చెక్‌లిస్ట్‌ ఏర్పాటు చేస్తామన్నారు.