
ప్రజారక్షణ భేరి యాత్ర కడప సభ (లైవ్)
-----------------------------000000000000----------------------------------------
ఉదయం బద్వేల్ లో జరిగిన సభ..
బిజెపి అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలి : ఎం.ఎ గఫూర్
ప్రజాశక్తి-కడప ప్రతినిధి : 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల ఎన్నికల ముంగిట బిజెపి అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. బుధవారం బద్వేల్ పట్టణంలోని కూడలిలో లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ , అసమానతలు లేని రాష్ట అభివృద్ధి పేరుతో సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014, 2019 సార్వత్రిక ఎన్నికల ముంగిట నరేంద్ర మోడీ విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారని, ఎవరి ఖాతాలోనైనా రూ. 15 లక్షలు కాదు, రూ15 వేలైనా పడ్డాయా అని ప్రశ్నించారు. ఇదేతరహాలో రాష్ర విభజన సమయంలో కేంద్రంలోనీ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిజెపి కలిసి రాష్ర విభజన చేసిన సమయంలో రాష్టానికి పదేళ్లపాటు ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ఉత్తరాంద్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రైల్వేజోన్, పోలవరం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చారన్నారు. పదేళ్లు గడుస్తున్నా ఏఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. ఇందులో తిరుపతి మీటింగులో పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తామని మోడీ హామీనిచ్చాడని, అనంతరం 15 ఫైనాన్స్ కమిషన్ అంగీకరించలేదని పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడని, 15ఫైనాన్స్ ఛైర్మన్ ను నిలదీస్తే తాము చెప్పలేదని తేలిపోయిందని చెప్పారు. ఇటువంటి అబద్దాల కోరు ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా గురించి మోడీని అడిగిన పాపాన పోలేదన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి పట్ల ఏమైనా భ్రమలున్నాయా అని ప్రశ్నించారు. కడపలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉద్యోగాలొస్తాయని, ఫలితంగా జిల్లాల నుంచి వలసలు ఉండవని తెలిపారు. బాబు హయాంలో బండరాయి వేశాడని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బండరాయి వేశాడని, ఇటీవల జెఎస్ డబ్ల్యూ పేరుతో డ్రామాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. విభజన హామీల్లోని కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యంకాదని ప్రధాని మోదీ చెబుతున్నారన్నారు. అమరాతి నవనగరాల పేరుతో బాబు సాగించిన ప్రచారం తగదని చెప్పామని, వినకపోవడం వల్ల ఓడిపోయాఢని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుడా అసమానతలు లేని రాష్ట్రాభివృద్దిని విస్మరించి బటన్ నొక్కుతున్నాడని, ఓడిపోవడం తథ్యమన్నారు. సంక్షేమం పేరుతో రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాడని, ఇందులో రూ.2.5 లక్షల కోట్లు పంపణీ చేశాడని, మిగిలిన రూ.7.5 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పాలని నిలదీశారు. అనంతపురం జిల్లా కల్లూరులో పేదల గుడిసెలను కూల్చడం దారుణమన్నారు. ఇన్ జెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ బరి తెగించడాన్ని గమనిస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పోయే కాలం దాపురించిందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మోదీ, షాలతో కలిసే బాబును జైలుకు పంపించాడని, అయినప్పటికీ బాబు ధన్యవాదాలు తెలిపడం శోచనీయమన్నారు. కర్నాటక, తెలంగాణా ఎన్నికల సందర్భంగా ఎగువభద్ర, కృష్ణా జలాల పంపిణీపై కెసిఆర్ తో కలిసి ట్రిబ్యునల్ వేయడం దివాలా కోరుతనమని తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో అన్యాయం చేస్తే సహించబోమని చెప్పారు.అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు భాస్కరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుపతి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పరిశ్రమలు మూతపడున్నా ముఖ్యమంత్రికి పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ని బిజెపి సర్కారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అంగడి సరుకుగా మార్చుతోందని విమర్శించారు. ప్రధాని బీసి అయితే బీసీలకు ఏమి ఒరగబెట్టారో వెల్లడించాలన్నారు. తరువాత సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకులు రమాదేవి మాట్లాడుతూ భేటీ బచావో..భేటీ పడావో నినాదం ఇస్తూనే స్త్రీలకు నూతన విద్యా వీధానాన్ని అమలు చేస్తూ విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. హత్యలు , అత్యాచారాలు పెచ్చరిల్లుతున్న నేపధ్యంలో పాఠశాలల విలీనాలతో విద్యను దూరం చేయడం తగదన్నారు. భవన నిర్మాణ కార్మిక బోర్డుల నిధులను మాయం చేసి, కార్మికులకు అన్యాయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, సిపిఎం రాష్ట కమిటీ సభ్యులు ఉమామహశ్వరరావులకు అంగన్వడీలు మున్సిపాలిటీ యూనియన్ కార్మికులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణయ్య, రాణి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, బద్వేల్ పట్టణ కార్యదర్శి వర్గ దర్శి సభ్యులు పి.చాంద్ బాషా, కె.నాగేంద్రబాబు. ఎన్ భైరవప్రసాద్, ఎస్ ఏ ఖాదర్ భాషా, టీ.వెంకటేష్ , ఆర్ ఓబయ్య, ఎస్, గురవయ్య, పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


