Feb 28,2021 12:33

ఎందరెందరో త్యాగజీవుల.. మరెందరెందరో పోరాటయోధుల కృషి ఫలితంగా.. విశాఖ ఉక్కు సాధన సాధ్యమైంది. అలా ఉద్యమంలో పుట్టి.. ఉద్యమంలో పెరిగి.. ఉద్యమంతో సంరక్షింపబడుతున్న విశాఖ ఉక్కు.. ఉద్యమంతోనే ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకుంటుంది. సంస్థ స్థాపనకు భూములిచ్చిన కుటుంబాల్లో వారికే ఉపాధి ఇచ్చేందుకు ఐటిఐనే స్థాపించింది. అప్పటివరకూ మత్స్యకారులుగా, రైతులుగా ఉన్న ఆ కుటుంబాలు కార్మికవర్గంగా ఎదిగాయి. పరిశ్రమ నేపథ్యంలోనే చుట్టూ అనేక విధాల అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆ ప్రాంతమే రాష్ట్రంలోనే అత్యధిక జిడిపిని చెల్లిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు, సామాజిక న్యాయం కోసం కార్మికులు పాటుపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మనెంటు ఉద్యోగులతో సమానమైన బెనిఫిట్స్‌ పొందగలిగారు. ఇవన్నీ ప్రభుత్వరంగం కావడం వల్లనే సాధ్యమైంది. అదే ప్రయివేటు పరిశ్రమ అయితే వీటిల్లో ఒక్కటైనా చేపడుతుందా? అంటే లేదనే సమాధానం. ప్రభుత్వరంగంతోనే ప్రజా సంక్షేమం.. దీనిపైనే ఈ కథనం..

భూముల త్యాగం.. ఉద్యోగాలు లభ్యం..
స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇచ్చిన 63 గ్రామాల్లో 16 వేల మంది నిర్వాసితులకుగానూ ఎనిమిది వేల మందికే ఉద్యోగాలు వచ్చాయి. మరో ఎనిమిది వేల మంది ఇంకా పోరాడుతూనే ఉన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సాధించబడి మూడు తరాలు దాటినా ఉపాధి లభించక అల్లాడుతున్న కుటుంబాలు ఆర్‌ కార్డులతో వేచి చూస్తూన్నాయి. ప్రభుత్వరంగం ఉండబట్టే వీరి హక్కుకోసం నిత్యం పోరాడుతున్నారు. ప్రైవేటీకరణ జరిగితే అడిగే హక్కు కూడా ఉండదు. భూములు త్యాగం చేసిన గ్రామాల్లో ఒక్క గాజువాక ప్రాంతమే గాకుండా అప్పికొండ, కణితి, కొండయ్యవలస, నడుపూరు, వడ్లపూడి ఇవన్నీ కుగ్రామాలుగా ఉండేవి. మత్స్యకారులు, రైతులు వందల సంఖ్యలో 1980వ దశకంలో కంచరపాలెం పాత ఐటిఐ సెంటర్‌లో నైపుణ్య శిక్షణ తీసుకున్నారు. అలా శిక్షణ తీసుకున్న ఐదు వేల మందికి పైగా ప్లాంట్‌లో ఉద్యోగాలు సాధించుకున్నారు. ఈ ఐటిఐని కేవలం స్టీల్‌ప్లాంట్‌ పరిశ్రమ కోసమే నాడు స్థాపించారు. సామాజిక రంగంలో ఎస్సీ, ఎస్టీలు ఆరు వేల మంది వరకూ ప్లాంట్‌లో సాంకేతిక, అర్హతలను బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ రాక పూర్వం ఆ ప్రాంతంలో భూమి గజం పది రూపాయలు ఉండగా, నేడు వేలల్లో ధర పలుకుతోంది. బహుళ అంతస్థుల భవనాలు సైతం ఈ ప్రదేశాల్లో వెలిశాయి. నేడు అత్యంత విలువైన స్టీల్‌ప్లాంట్‌నే కాదు అత్యంత ఖరీదైన ఈ ప్రదేశాలను గుప్పెట పెట్టుకోవడానికి గద్దల్లా కార్పొరేట్లు కాపుకాసి కూర్చున్నాయి. విశాఖ ఉక్కును రక్షించుకోకపోతే విశాఖపట్నమే కాదు రాష్ట్ర ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక 'పతనం' అవుతుంది. ఈ ఆందోళన ప్రధానంగా ఉత్తరాంధ్ర వాసుల్లో, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర కలత రేపుతోంది.

అంకితభావంతోనే ఉత్పాదక సామర్థ్యం..


అంకితభావంతోనే ఉత్పాదక సామర్థ్యం..
సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పాదక సామర్థ్యంపై దృష్టి సారిస్తూ నైపుణ్యం, అంకితభావం కలిగిన ఉద్యోగులు.. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు గొప్ప వనరు. ఏడాదికి ఒక ఉద్యోగి ఉత్పాదక శక్తి చూస్తే 450 టన్నులు. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సందర్భంగా 18 వేల మంది రెగ్యులర్‌ కార్మికులు స్టీల్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. తాజాగా ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులకు పెరిగింది. కేవలం 1900 మంది కొత్త ఉద్యోగాలకే కేంద్రం అనుమతించింది. సిఐటియు పోరాడి, ఆరు వేల మందికి కొత్త పర్మినెంట్‌ ఉద్యోగాలను సాధించుకోవడం జరిగింది. వీరుకాకుండా మరో 20 వేల మందితో కాంట్రాక్టు పద్ధతిపై లేబర్‌ ఫోర్స్‌ ప్లాంట్‌లో పనిచేస్తోంది. ప్రభుత్వరంగ పరిశ్రమ అయినందున హక్కులను సాధించుకునే వీలు కలిగింది. అదే ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలకే భద్రత ఉండదు. టన్ను ఉత్పత్తి విలువ రూ.38 వేలు. 2018-2019 లెక్కల ప్రకారం ఏటా వీరి జీతాలు రూ.2,200 కోట్లు కాగా, ఇతర ఓటి, టిఏ బెనిఫిట్స్‌ మరో రూ.200 కోట్లు. స్టీల్‌ప్లాంట్‌ కార్మిక కుటుంబాలకూ సోషల్‌ సెక్యూరిటీ స్కీం ఉంది. సర్వీసులో ఉద్యోగి చనిపోతే ఆ నాటికి అతనికి ఉండే బేసిక్‌, డిఏను ప్రతినెలా అతని భార్యకు చెల్లిస్తారు. ఇంకా సర్వీసు ఉన్నంతకాలమూ ఇస్తారు. ఈ విధానం దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థలోనూ లేదు. గ్రాట్యుటీ, పిఎఫ్‌ వగైరా సౌకర్యాలూ విడిగా ఇస్తారు. స్టీల్‌ ప్లాంట్‌లో సిఐటియూ నేతృత్వంలో కార్మికులు పోరాడి వీటిని సాధించుకున్నారు. ప్రభుత్వరంగమే లేకుంటే ప్రైవేటీకరణ జరిగితే ఈ సౌకరాక్యలు లేక ఉద్యోగుల కుటుంబాలూ రోడ్డున పడాల్సి వస్తుంది.

ఉద్యోగ కల్పన.. పర్యావరణ పరిరక్షణ


ఉద్యోగ కల్పన.. పర్యావరణ పరిరక్షణ
సామాజిక న్యాయం పరిరక్షణలోనూ స్టీల్‌ప్లాంట్‌ ముందంజలో ఉంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 2,500 మంది వరకూ దీనిలో పనిచేస్తున్నారు. 73 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులకు వెళ్లిన సందర్భంగా కార్మికులు ప్లాంట్‌ లోపల, పరిసరాల చుట్టూ కోటి మొక్కల్ని నాటారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌లో వాతావరణం పర్యావరణానికి అనుకూలంగా మారిపోయింది. స్టీల్‌ప్లాంట్‌ లోపల బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మండుతున్నా వెలుపల ఉన్న చెట్ల వల్ల ఆ ఉష్ణోగ్రతలు నియంత్రణలోకి రావడం జరుగుతుంది. విశాఖ ఉష్ణోగ్రతలతో పోల్చితే ఎండాకాలంలోనూ స్టీల్‌ప్లాంట్‌లో బయట కన్నా నాలుగు డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. పర్యావరణ హితంగా ప్రభుత్వరంగంలోని కార్మికవర్గం వ్యవహరిస్తుందనడానికి ఇదో తార్కాణం.

గాజువాక ప్రాంత అభివృద్ధి..


గాజువాక ప్రాంత అభివృద్ధి..
గాజువాక ప్రాంతంలో 1956లో ''గజవాగు'' అనే పేరు చెలామణిలో ఉండేది. ఎందుకంటే ఏనుగుల గుంపు ఆ ప్రాంతంలోని 'జింకు గేటు' వద్ద సేదతీరేందుకు వచ్చేవి. ఆ ''గజవాగు'' నేడు ''గాజువాక''గా మారింది. గాజువాక దేవాడ మొఖాసా (ఈనాం) లో ఉండేది. 1960లో గాజువాక జనాభా మూడువేల మంది. నేడు ఆ సంఖ్య ఆరు లక్షలకు పెరిగింది. గాజువాక సింహభాగం అభివృద్ధి వెనుక స్టీల్‌ప్లాంటే ఉందన్నది తిరుగులేని వాస్తవం. పేరెన్నికగన్న షాపింగ్‌ మాల్స్‌కు నేడు గాజువాకే కేంద్రం. విశాఖ నగరంలో లేని మాల్స్‌ కూడా ఇక్కడ నెలకొల్పబడ్డాయి. గాజువాకే కాదు, విశాఖపట్నం రూపురేఖలే స్టీల్‌ప్లాంట్‌ వల్ల మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. ''పారిశ్రామిక నగరి''గా గాజువాక పేరొందింది. ఆటోనగర్‌, పెదగంట్యాడలో గల 500 స్టీల్‌ అనుబంధ పరిశ్రమల్లో 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఏటా స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల జీతాల వల్ల రూ.2,500 కోట్లు మార్కెట్‌లోకి ఏదో ఒక రూపంలో వస్తున్నాయి. కూర్మన్నపాలెంలో రియల్‌ ఎస్టేట్‌ గడచిన 15 ఏళ్లుగా ఊపందుకుంది. గాజువాక ఒక ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చెందింది. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల పిల్లలు ఐఐటి, ఎన్‌ఐఐటి, మెడిసిన్‌, ఎంబిఏ, ఐఆర్‌ఎస్‌ వంటి రంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉంటూ ఈ ప్రాంతంలోనే ఆవాసాలు కట్టుకున్నారు. దీనివల్ల నిర్మాణ రంగం, అందులో పనిచేసే కార్మికులు వృద్ధి చెందారు. మొత్తంగా చూస్తే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరిగాక విశాఖపట్నం రూపురేఖలు మారిపోయాయి. చుట్టుపక్కల ప్రజల్లో కొనుగోలు శక్తీ పెరిగింది. గాజువాక ప్రాంతంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖ జిల్లా తలసరి ఆదాయం రూ. లక్షా 25 వేలుగా ఉంది. రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గ తలసరి ఆదాయం అధికంగా రూ.2.75 లక్షలుగా ఉంది. వడ్లపూడిలో రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌ నిర్మితమవుతోంది. ఆటోనగర్‌ ఏరియా మొత్తం టెక్స్‌టైల్‌ ఇండిస్టీ హబ్‌గా మారి, 25 కొత్త పరిశ్రమలు ఇక్కడ అవతరించాయి.

త్యాగాల పునాది.. ఉద్యమాలే ఊపిరి..


త్యాగాల పునాది.. ఉద్యమాలే ఊపిరి..
ఈ భూ ప్రపంచంపై ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఏదీ లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంటేనే ఏమిటో తెలియని 1960వ దశకంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ మహా ఉద్యమం నడిపారు. ఆ పోరాటంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. 52 మంది కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు, ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష సభ్యులు 15 మంది మొత్తంగా 67 మంది, మరో ఏడుగురు ఎంపీలు తమ తమ పదవులను తృణప్రాయంగా త్యజించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో ప్రధాన చారిత్రక ఘట్టం ఈ మూకుమ్మడి రాజీనామాలు. రాష్ట్రం అంతటా లక్షల సంఖ్యలో విద్యార్థులు ఏకైక అజెండాతో సాగించిన ఈ పోరాటం ఆంధ్ర ప్రజానీకాన్ని ఉద్యమం వైపు నడిపించింది. ఒకే నినాదం కింద ప్రజలు ఉద్యమం కోసం కదిలితే సాధించి తీరుతారని చెప్పడానికి సజీవ సాక్ష్యంగా నేటికీ ఈ ఉక్కు పరిశ్రమే తార్కాణం. యావత్‌ భారత దేశంలోనే ప్రాణాలర్పించి సాధించిన భారీ కర్మాగారం ఏదైనా ఉందంటే స్టీల్‌ ప్లాంట్‌ మాత్రమే.. వందలాది మంది రైతులు, ప్రజల త్యాగాల ఫలం ఇది. నాడు సొంతంగా స్టీల్‌ప్లాంట్‌ నిర్మించుకునే స్థోమత మన వద్ద లేనందున ప్రపంచ పెట్టుబడిదారీ దేశాలుగా ఉన్న అమెరికా, జర్మనీ, బ్రిటన్‌ సహకారం తీసుకుందామని మన దేశం ప్రతిపాదించినా అవి నిరాకరించాయి. కానీ ఏ షరతులూ విధించకుండా సోవియట్‌ (యూనియన్‌) రష్యా ఎంతగానో ఉక్కు కర్మాగారానికి సహకరించింది. నిస్వార్థంగా స్నేహహస్తం అందించింది. ప్రపంచంలో సామ్యవాద భావజాలం, సోవియట్‌ రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం అధికారంలో ఉన్న 1980వ దశకంలో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సోవియట్‌ రష్యా నుంచి సహకారం లభించింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు రష్యా టెక్నాలజీ, యంత్ర పరికరాల సహకారంపై 1981 ఫిబ్రవరిలో అగ్రిమెంట్‌ జరిగింది. దీంట్లో భాగంగా 600 మంది రష్యన్‌ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, డ్రాయింగ్‌ మెన్స్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చి పనిచేశారు. సెక్టార్‌-1 రష్యన్‌ క్వార్టర్స్‌ స్టీల్‌ప్లాంట్‌లో ఉంది. అలాగే ఒక స్కూలు, ఒక ఆడిటోరియం, ఇతర అనేక సదుపాయాలు కల్పించబడ్డాయి. 1990వ దశకంలో నిర్మించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం దేశం గర్వించదగినదిగా చరిత్రకెక్కింది. తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి కేంద్ర ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారం ఇదే. 1965లో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి అనువైన స్థలంగా కేంద్ర నిపుణుల కమిటీ ప్రతిపాదించగా.. 1971లో ఉక్కు ఫ్యాక్టరీ కోసం శంకుస్థాపన జరిగింది. 1979లో నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో నిర్మాణ అంచనా వ్యయం రూ. 2256 కోట్ల నుంచి రూ. 8800 కోట్లకు వెళ్లిపోయింది. ఆటంకాలను అధిగమిస్తూనే 1991లో ఉత్పత్తి ప్రారంభం కావడంతో దేశ ఆర్థికవ్యవస్థ పురోగమన స్థాయిలో నిలిపేందుకు విశాఖ ఉక్కు ఎంతగానో తోడ్పడింది. 1966-1970 మధ్య ఎన్నో ప్రజా ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ 'ఉక్కు' కర్మాగారాన్ని కబళించే కుట్రలు తాజాగా ఊపందుకుంటున్నాయి.

భగ్గుమన్న కార్మికవర్గం..


భగ్గుమన్న కార్మికవర్గం..
రాష్ట్రానికి గల అతిపెద్ద భారీ పరిశ్రమ స్టీల్‌ప్లాంట్‌. నేడు దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్‌కు దక్కకుండా కేంద్రం చూస్తోంది. పూర్తి ప్రభుత్వరంగంలో ఉన్న విశాఖ స్టీల్‌ను మొత్తంగా అమ్మేయాలని కేబినెట్‌ కమిటీ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ (సిసిఇఎ) నిర్ణయించింది. మన రాష్ట్ర పారిశ్రామిక మనుగడకే ప్రమాదం తెచ్చి పెడుతోంది. ప్రధాని మోడీ నియంత్రణలో గల నీతి అయోగ్‌లోని ఒక విభాగం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిజెన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెస్‌మెంట్‌ మేనేజిమెంట్‌ (దీపం) సెక్రటరీ, ఒడిశాకు చెందిన టికే పాండే జనవరి 30న ట్విట్టర్‌లో ఇదే విషయం ట్వీట్‌ చేశారు. దీంతో విశాఖ కార్మికలోకం, ప్రజానీకం ఈ నిర్ణయంపై భగ్గున మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైనంత వరకూ ప్రైవేటీకరిస్తామనీ, అందుకు వీలుపడని వాటిని మూసేస్తామనీ మరో దఫా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో ప్రకటించారు. నేడు మోడీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. రూ.2.10 లక్షల కోట్లు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా తమ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే రూ. 32 వేల కోట్లు వచ్చాయని, 'ఆత్మనిర్భర్‌ భారత్‌' కు ఇవి చాలవంటూ ప్రకటించారు. దీంతో విశాఖ కార్మికవర్గం, ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తొలి పోరాటం సిఐటియు నేతృత్వాన స్టీల్‌ప్లాంట్‌లో ఫిబ్రవరి 3న సిఐటియు ఆధ్వర్యాన అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్ద జరగ్గా.. 5న జివిఎంసి వద్ద వేలాదిగా తరలివచ్చిన కార్మికులతో మహార్యాలీ, మహా బహిరంగ సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ 9న ఏర్పాటైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ప్రధానికి లేఖ రాయడం తెలిసిందే. ఈ నెల 12 నుంచి స్టీల్‌ప్లాంట్‌ కూర్మన్నపాలెం గేటు వద్ద రిలే నిరాహారదీక్షలు పోరాటకమిటీ ఆధ్వర్యాన కార్మికులు కొనసాగిస్తున్నారు. బిజెపి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యత్నాలు ముమ్మరం అయ్యాయి. కేంద్ర ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ 2019 నవంబరు 9న విశాఖ స్టీల్‌లో పర్యటించారు. సౌత్‌ కొరియా కంపెనీ ''పోస్కో'' వారిని 2020 ఫిబ్రవరి 21న పంపారు. బిజెపి గత ఐదేళ్లలో దేశంలోని సేలం, భద్రావతి, దుర్గాపూర్‌ స్పెషల్‌ స్టీల్‌ కంపెనీలను వ్యూహాత్మక అమ్మకాలు చేయాలని ప్రయత్నించి, విఫలమైంది. తాజాగా పోస్కో ప్రతినిధులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు 2019లో వచ్చి, స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై చర్చించారని స్వయంగా కేంద్రమంత్రే చెప్పారు. సిఎం కూడా పోస్కో తనను కలిసింది వాస్తవమనీ, కడపలో పరిశ్రమ పెట్టమని కోరానని చెప్తున్నారు. ఏదేమైనా ప్రజాందోళనకు తలొగ్గి విశాఖ ఉక్కుపై కేబినెట్‌ తీర్మానం చేయాల్సి వచ్చింది.

నష్టాలు నిజమేనా?


నష్టాలు నిజమేనా?
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దేశంలోనే అన్ని స్టీల్‌ప్లాంట్‌లతో పోల్చితే అత్యంత ఆధునికమైనది. ప్లాటుకు రూ. 2.40 లక్షల కోట్ల విలువైన 23 వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రస్తుతం 7.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తూ 20 మిలియన్‌ టన్నులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ మౌలిక వసతుల సంపదను కొల్లగొట్టే కార్పొరేట్‌లకు కేంద్రంలోని బిజెపి తోడై, ''వంద శాతం వ్యూహాత్మక అమ్మకాని''కి తాజాగా దిగింది. నష్టాలన్న మాట ఒక సాకు మాత్రమే అనడానికి అనేక ఆధారాలున్నాయి. ప్రతి ఏటా లెక్కలు చూస్తే అర్థమవుతోంది. 1990-91 సంవత్సరం నుంచి 2019-2020 వరకూ మొత్తం నష్టాలు రూ.12,973 కోట్లు. ఈ కాలంలోనే రూ. 18,069 కోట్లు లాభాలు వచ్చాయి. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్‌ రూ.5,096 కోట్లు లాభాల్లో ఉంది. ఈ నష్టాలు కూడా ప్రారంభంలో 1990-2001 వరకే ఉన్నాయి. ఆ తర్వాత 2015 వరకూ లాభాలు వచ్చిన ఉక్కు పరిశ్రమ 2015-2018 మధ్య కాలంలో కొంత నష్టాల్లో పడింది. 2018-2019లో రూ.97 కోట్లు స్వల్ప లాభంలో ఉంది. మొత్తం లాభాల నుంచీ నష్టాలను తీసేస్తే (ఏటా ప్రభుత్వ లెక్కలను బట్టే) స్టీల్‌ప్లాంట్‌ రూ.5,096 కోట్లు ప్రస్తుతం లాభాల్లోనే ఉంది. 2006 మే నెలలో 3.6 మిలియన్‌ టన్నుల నుంచి 6.3 మిలియన్‌ టన్నుల విస్తరణ సామర్థ్యానికి రూ. 8,500 కోట్లతో అంచనా వేశారు. ఈ విస్తరణ 2018 వరకూ కొనసాగి, రూ.13 వేల కోట్లకు అంచనా వ్యయం పెరిగిపోయింది. ప్రారంభ నిర్మాణ వ్యయం అంచనాల పెరుగుదల, విస్తరణ సందర్భంగా పెరిగిన అంచనాల వ్యయం కలిపి స్టీల్‌ప్లాంట్‌ రూ.19,700 కోట్లు బ్యాంకులకు బకాయి పడింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి రూ. 38 వేల కోట్లకు పైగా డివిడెండ్లు ఇంతవరకూ చెల్లించింది. 'దేశంలో టాటా స్టీల్‌ రూ.1.40 లక్షల కోట్లు, జిందాల్‌ రూ.54 వేల కోట్లు, సెయిల్‌ రూ.70 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గల రూ.3 లక్షల కోట్ల విలువ చేసే 23 వేల ఎకరాల భూ సంపదను, యావత్‌ ప్లాంట్‌ను కార్పొరేట్లకు నరేంద్ర మోడీ, బిజెపి దోచిపెట్టాలని చూస్తున్నారు' అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.