Jan 04,2021 00:32

సదస్సులో మాట్లాడుతున్న అజశర్మ

ప్రజాశక్తి-యంత్రాంగం : పట్టణ సంస్కరణల్లో భాగంగా పన్నుల పెంపుపై అవగాహన కల్పిస్తూ సిపిఎం, వార్వా, నివాస్‌, ప్రజాసంఘాల ఆధ్వర్యాన నగరంలో పలు చోట్ల ప్రచారం, సమావేశాలు, సదస్సులు నిర్వహించారు.
పెందుర్తి : పన్నుల పెంపుపై
ఉద్యమం రావాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ అన్నారు. సప్తగిరి నగర్‌లోని కల్యాణ మండపంలో వార్వా, నివాస్‌ ఆధ్వర్యాన పన్నుల పెంపుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రవేశపెట్టిన పట్టణ సంస్కరణలను రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అమలుచేయడం వల్ల పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పల్లెల్లో 0.1 శాతం పట్టణాల్లో 0.5 శాతం పెరిగినట్లు చెప్పారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన ప్రకారం ఆయా స్థలాల్లో అక్కడున్న ఖరీదును బట్టి ఇంటి పన్నులు పెరుగుతాయన్నారు. పన్నులు వేయాలంటే పాలకవర్గం ఉండి తీరాలన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఆర్టికల్‌ 47 ప్రకారంగా మౌళిక సదుపాయాలు కల్పించిన తర్వాతే పన్నులు వేయాలన్నారు. ఎన్‌ఎడి కాలనీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బిటి.మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్వా, నివాస్‌ జిల్లా అధ్యక్షులు జి.సూర్య ప్రకాశరావు, ఎ.జయబాబు, శాస్త్రి, బి.అనంతలక్ష్మి, బి.రమణి, మౌలాలి పాల్గొన్నారు.
అల్లిపురంలో ప్రచారం
కలెక్టరేట్‌ : పట్టణ సంస్కరణలలో భాగంగా ఇళ్లు, నీరు, మురుగు నీటి పన్నులంటూ ఒకేసారి ప్రజలపై వేసిన భారాలను నిరసిస్తూ ఈ నెల 6న జివిఎంసి వద్ద నిర్వహించే ధర్నాకు సంబంధించి సిపిఎం ఆధ్వర్యాన ఆదివారం ప్రచారం నిర్వహించారు. సిపిఎం జగదాంబ జోన్‌ కమిటీ ఆధ్వర్యాన అల్లిపురంలో కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర నాయకులు వై.రాజు మాట్లాడుతూ, గృహ విస్తీర్ణంపై కాకుండా మార్కెట్‌ ధర ప్రకారం పన్ను విధింపు దారుణమన్నారు. మురుగు నీటికి పన్ను విధించడం సిగ్గుచేటన్నారు. పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 6న జివిఎంసి వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.సుబ్బారావు, కెవిపి.చంద్రమౌళి, గోవింద్‌, శ్రీను పాల్గొన్నారు.
స్నేహపురి కాలనీలో సమావేశం
గాజువాక : కొత్త ఆస్తిపన్ను చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆదివారం స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఆదివారం సమావేశమయ్యారు. వార్వా నాయకులు ప్రకాశరావు మాట్లాడుతూ, కొత్తగా తెచ్చిన చట్టం వలన ఆస్తి పన్నులు విపరీతంగా పెరుగుతున్నాయని, వీటిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు వాసు, సిఐటియు నాయకులు ఎన్‌.రాజేంద్రప్రసాద్‌, స్నేహపురి కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పివైవి.రమణారావు, కె.రాజు పాల్గొన్నారు.