
- సీతంపేట, ఆదోనిల్లో ప్రజారక్షణ భేరి బస్సు యాత్రలు ప్రారంభం
బిజెపితో బంధం వినాశకరమని, ఆ పార్టీ విషకౌగిలి నుంచి వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బయటకు రావాలని సిపిఎం నాయకులు కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం బస్సు యాత్రలు ప్రారంభయ్యాయి. బస్సు యాత్రలను ఆదోనిలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, సీతంపేటలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఆదోనిలో ప్రారంభమైన యాత్ర తొలి రోజు కర్నూలు వరకూ సాగింది. సీతంపేటలో ప్రారంభమైన యాత్ర పాలకొండ, కురుపాం మీదుగా పార్వతీపురం చేరుకుంది. దీనికి అనుబంధంగా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.