Apr 01,2023 18:15
  • ప్రజల ఎజెండాగా పాలక పార్టీలపై ఒత్తిడి
  • ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పట్టణ ప్రాంత ప్రజలపై కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని మూడేళ్లలో 50 శాతం పెంచిందని, ఐదేళ్లలో 100 శాతానికి పెరుగుతుందని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు తెలిపారు. పెనుభారాలు మోపే ఈ చర్యలను ప్రజల ఎజెండాగా మార్చి ఈ ఏడాది కాలం పాటు ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పట్టణ పౌర సమాఖ్యల రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబూరావు మీడియాకు వివరించారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1.50 కోట్లమంది జీవిస్తున్నారని వారందరికీ ఆస్తిపన్నులతోపాటు గ్యాస్‌, పెట్రోలు, సిమెంటు, చెత్తపన్ను, మంచినీటి పన్నులు వంటివి పెనుభారంగా మారాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను పరిపాలనా కేంద్రాలుగా కాకుండా పన్నులు వసూలు చేసే సంస్థలుగా మార్చేశాయని పేర్కొన్నారు. ఆస్తి విలువ అధారంగా పన్ను వసూలు చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర తూచ తప్పకుండా అమలు చేస్తోందని విమర్శించారు. గతంలో 100కు 15 శాతం పెంచారని, రెండో ఏడాది 115 శాతంపై మరో 15 శాతం పెంచారని, ఇలా రెండేళ్లలో 32 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్‌ నుండి మరో 15 శాతం భారం విధించనున్నారని పేర్కొన్నారు. ఆస్తిపన్నుతోపాటు చెత్తపన్ను, మంచినీటి పన్ను వసూలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, దాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. అమృత్‌ పథకంలో భాగంగా ఇళ్లకు నీటిమీటర్లు పెడుతున్నారని, ఇప్పటికే విజయవాడలో అమలు చేశారని తెలిపారు. ఇవేకాకుండా ఇళ్ల క్రమబద్దీకరణ, సీలింగు, రెవెన్యూ, నాలా, ఓటిఎస్‌ వంటి రూపాల్లో పెనుభారం మోపుతున్నారని పేర్కొన్నారు. భారాలను పక్కదారి పట్టించేందుకు ఆస్తిపన్నులో వడ్డీ మాఫీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు. 24 శాతం పెనాల్టీ విధించాలనే నిబంధనను మార్చి నామమాత్రపు పెనాల్టీలు ఉండేలా చూడాలన్నారు. ఇప్పటి వరకూ మున్సిపాలిటీల్లో 1995 కోట్లు ఆస్తిపన్ను వసూలైందని, గతేడాది రూ.1412 కోట్లు మాత్రమేనని తెలిపారు. అంటే రూ.583 కోట్లు అదనపు భారం పడిందని వివరించారు. దీంతోపాటు వేర్వేరు రూపాల్లో పన్నేతర అదాయం రూ.1005 కోట్లు వచ్చిందని, చెత్తపన్ను రూపంలో 1.34 కోట్ల కుటుంబాల నుండి 112 కోట్లు అదనంగా వసూలు చేశారని పేర్కొన్నారు. పన్నుల వసూళ్ల మీద ఉన్న దృష్టి అభివృద్ధిపై లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థలను నీరుగార్చారని పేర్కొన్నారు. ప్రజలపై మోపుతున్న భారాల తీరుపై అధికారపార్టీ ప్రజాప్రతినిధులే ఎదురు తిరుగుతున్నారని వివరించారు. జగనన్న ఇళ్లు నత్తనడకన సాగుతున్నాయని, టిడ్కో ఇళ్లు ఇవ్వడం లేదని, కట్టిన ఇళ్లు పాడైపోతున్నాయని వివరించారు. వేసవిలో మంచినీటి ఎద్దడిని తీర్చే యాక్షన్‌ ప్లాన్‌ ఇంతవరకు రూపొందించలేదని, విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలనూ నెలనెలా మోపుతున్నారని తెలిపారు. వీటిపై పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యాన క్షేత్రస్థాయిలో ప్రచారం, పోరాటం నిర్వహిస్తామని, అవసరమైతే న్యాయపరంగానూ పోరాడుతామని పేర్కొన్నారు.