May 10,2023 17:56
  • పేదలను మోసగించేలా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన

ప్రజాశక్తి - తుళ్లూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేస్తూ పేదలను మోసగించేలా పాలన సాగిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. అమరావతి రాజధానిలో సెంటు స్థలం పంపిణీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివాదం చేస్తోందని అన్నారు. వివాదాలు లేకుండా రైతులతో మాట్లాడి పేదలకు ఇబ్బందులు కలగకుండా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నారు. వివాదాలు ఉన్న చోట స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడడం, పేదలను సమస్యలలోకి నెట్టడం సరికాదన్నారు. బుధవారం రాజధానిలోని తాళ్లాయపాలెం వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.టిడ్కో గృహాలను ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని బాబురావు డిమాండ్ చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ,తమది పెత్తందారులపై పోరాటం, పేదల ప్రభుత్వం అంటూ.. ముఖ్యమంత్రి చెప్పేమాటల్లో చిత్తశుద్ది లేదన్నారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల్లో వ్యవసాయం లేదని రాజధాని పనులు నిలిచిపోయి పేదలకు ఉపాధి లేదని అన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ది చేస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సబబుగా ఉంటుందన్నారు. రాజధానిలో నైనా, రాష్ట్రంలో నైనా, ఎక్కడైనా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది సిపిఎం అభిమతమన్నారు. అమరావతిలోని 5 వేల మంది పేదలు ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలు చొప్పున టిడ్కో ఇళ్లకు డిపాజిట్లు కట్టారనీ, ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్లుగా కాలయాపన చేస్తూ పేదలకు నేటికీ అప్పగించ లేదన్నారు .తక్షణమే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, వి వెంకటేశ్వర్లు, కుంభా ఆంజనేయులు, వివిధ గ్రామాల లబ్దిదారులు పాల్గొన్నారు.