Jun 07,2023 14:50
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు

ప్రజాశక్తి-విజయవాడ : స్మశాన వాటికల్లో సదుపాయాల కల్పన వైసిపి ప్రభుత్వం గాలికి వదిలేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు విమర్శించారు. విజయవాడ అజిత్‌ సింగ్‌ నగర్‌లోని వాంబే కాలనీ వద్ద ఉన్న హిందూ స్మశాన వాటికను స్థానిక నాయకులతో కలిసి బాబురావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాదిమంది ప్రజలు నివసిస్తున్న అజిత్‌ సింగ్‌ నగర్‌, పాయకాపురం తదితర కాలనీలలో మరణించిన వారి అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసిన పైపుల రోడ్డు స్మశాన వాటికను అద్వాన్న స్థితిలోకి పాలకులు నెట్టారన్నారు. మూడు సంవత్సరాలుగా దహన సంస్కారాలు చేసే ప్లాట్‌ ఫారాలు, వినియోగించే రేకుల షెడ్డు పూర్తిగా దెబ్బతిని కూలిపోయే స్థితిలో ఉందన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌ నెలలో బాపట్ల బీచ్‌ లో మతి చెందిన శాంతి నగర్‌ విద్యార్థుల దహన సంస్కారాలకు వర్షంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురయ్యాయన్నారు. వర్షంలో పెట్రోలు, కిరసనాయులు, పంచదార వినియోగించినా రెండు గంటలు దహన సంస్కారాలు సాగాయని తెలిపారు. మూడు సంవత్సరాలుగా శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సిపిఎం, ప్రజా సంఘాలు గత సంవత్సరం ఆందోళన చేస్తే వారిపై స్థానిక ఎమ్మెల్యే పోలీసులతో కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు తన నియోజకవర్గంలోని స్మశాన వాటికలో కూడా పనులు చేయించలేని అసమర్ధ స్థితిలో ఉన్నారన్నారు. సిపిఎం పైన, వామపక్షాల పైన విమర్శలు చేయడం తప్ప అభివద్ధిపై దష్టి లేదన్నారు. కూల్చేసిన పాత షెడ్డు శిధిలాలు, నిర్మాణం కోసం తెచ్చిన కంకర, ఇతర సామాగ్రి పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ కనబడుతున్నాయని తెలిపారు. తక్షణమే దహన సంస్కారాలకు వీలుగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. లేనియెడల ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు బి.రమణరావు, కే.దుర్గారావు, టీ ప్రవీణ్‌,సి.హెచ్‌. శ్రీనివాస్‌, పీర్‌ సాహెబ్‌, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

2