Nov 11,2023 11:23

బ్రోచర్‌ను ఆవిష్కరించిన విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో  :  
విజయవాడలో ఈ నెల 14 నుంచి 20 వరకు జాతీయ పుస్తక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ వెల్లడించింది. ఈ సందర్భంగా గవర్నరుపేటలోని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ రీసెర్చి లైబ్రరీ ఆవరణలోని వేమూరి అనిల్‌కుమార్‌ సాహిత్య వేదికలో పుస్తక వారోత్సవాలు బ్రోచర్‌ను శుక్రవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. అనంతరం విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ కమిటీ అధ్యక్షులు టి మనోహర్‌నాయుడు, గౌరవాధ్యక్షులు బెల్లపు బాబ్జి, కార్యదర్శి కె లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి గోళ్ల నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ.. సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు, కళాకారులు, రచయితలు, మేథావులు, విద్యార్థులు పుస్తక వారోత్సవాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని  జయప్రదం చేయాలన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పుస్తక రచనలు ఎంతో కీలకపాత్ర పోషించాయన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా అనేక పుస్తకాలు రచించారన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, నెహ్రూ పుట్టినరోజు అన్నీ కలిసి ఒకేరోజు వచ్చాయన్నారు. ఈ నెల 14న ఉదయం 10:30 గంటలకు జాతీయ పుస్తక వారోత్సవాలను సిసిఎల్‌ఎ అడిషనల్‌ కమిషనరు ఎ మహ్మద్‌ ఇంతియాజ్‌ ప్రారంభిస్తారన్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర సంగీత నాటక అకాడమీ బహుమతి గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్‌, ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రావి శారద, జిఆర్‌కె అండ్‌ పోలవరపు సాంస్కృతిక సమితి గోళ్ల నారాయణరావు, విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ టి మనోహర్‌నాయుడు హాజరుకానున్నారు.

15న సాయంత్రం ఆరు గంటలకు ముళ్లపూడి హాస్యరచనలు, ఆత్మీయ అతిథి నండూరి రాజగోపాల్‌, 16న సాయంత్రం ఆరు గంటలకు తెలుగు నాటక సాహిత్యం అనే అంశంపై కందిమల్ల సాంబశివరావు ప్రధాన ప్రసంగం చేయనున్నారు. సభకు ఆత్మీయ అతిథిగా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌ హాజరుకానున్నారని తెలిపారు. 17న జనరంజక కవిత్వం అనే అంశంపైన రావి రంగారావు ప్రసంగించనున్నారు. ఆత్మీయ అతిథిగా చలపాక ప్రకాష్‌ హాజరుకానున్నారు. 18న సాయంత్రం ఆరు గంటలకు జరగే సభలో నేటి బాలల కోసం సాహిత్యం అనే అంశంపై వల్లూరి శివప్రసాద్‌  ప్రసంగించనుండగా,  ఆత్మీయ అతిథిగా భమిడిపాటి బాలా త్రిపుర సుందరి హాజరుకానున్నారు. 19న సాహిత్యం అందించిన మహిళా చైతన్యం అనే అంశంపై వాడ్రేవు వీర లక్ష్మీదేవి ప్రసంగించనుండగా, సభకు ఆత్మీయ అతిథిగా మందరపు హైమావతి హాజరు కానున్నారు. ఈ నెల 21న ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత దండమూడి సుమతీ రామ్మోహనరావు, ఆత్మీయ అతిథిగా కలిమిశ్రీ, వికీపీడియా షేక్‌ రెహమానుద్దీన్‌ వ్యవహరించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రోగ్రామ్స్‌కు జివి పూర్ణచంద్‌, మంజులూరి కృష్ణకుమారి సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.