వాంబే కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు

ప్రజాశక్తి-సింగ్‌నగర్ (ఎన్‌టిఆర్ జిల్లా) :ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీలోని రైల్వే ట్రాక్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. సింగ్‌నగర్‌లోని వాంబే కాలనీ ప్రాంతంలో సిపిఎం నేతలు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప పట్టించుకోవడంలేదని తెలిపారు. రోజు వారి పనులకు వెళ్లే మహిళలు పెరిగిన ప్రయాణ ఖర్చులు భరించలేక కాలినడకన రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోందన్నారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు రైల్వే ట్రాక్ దాటుతున్నారన్నారు. ఇటీవల కాలంలో రైల్వే ట్రాక్ దాటుతున్న ప్రజలను రైల్వే పోలీసులు నిర్బంధించి రూ.500 నుండి వెయ్యి రూపాయల జరిమానా విధించారని, ఫెనాల్టీ చెల్లించకపోతే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వందలాది మందిని రైల్వే కోర్టులకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రజలు నడవడానికి వీల్లేకుండా రైల్వే ట్రాక్ వెంట పెద్ద గోతులు తవ్వుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రేక్షకపాత్ర పోషిస్తూ అండర్ బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెట్టడంలేదన్నారు. రైల్వే పోలీసుల వేధింపులు ఆపాలని, అక్రమ పెనాల్టీలు, కేసులు నిలిపివేయాలని, అండర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.దుర్గారావు, సిహెచ్ శ్రీనివాస్, ఎస్.కె.పీరూసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.