
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : పెంచిన అస్తి పన్నును తగ్గించాలని, చెత్త సేకరణ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్తి పన్ను వ్యతిరేక ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ కమిటీ ప్రధాన కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ.. ఆస్తి విలువ ఆధారంగా ప్రతి సంవత్సరం పన్ను విధించడం దుర్మార్గమన్నారు. భవిష్యత్తులో ఇంటి విలువ కన్నా పన్నులే ఎక్కువగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులో చెత్తసేకరణ పన్ను కలపవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీ కార్యదర్శి జి.రమేష్ మాట్లాడుతూ.. చెత్త సేకరణ పన్ను రాజ్యాంగ విరుద్దమని తెలిపారు. ఈ పన్నును ఇంటి పన్నుతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. నిరసన అనంతరం మేయర్ గంగాడ సుజాతను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పౌర సమాజం కన్వీనర్ జి నరసింహారావు, సిఐటియు నగర నాయకులు దామా శ్రీనివాసులు, సిటిజన్ అసోషియేషన్ అధ్యక్షులు కొల్లా మధు పాల్గొన్నారు.