Sep 04,2020 18:22

రాష్ట్రంలోని వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు బిగించి, ఆ రీడింగ్‌ ప్రకారం బిల్లు లెక్కిస్తారట! ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు బ్యాంకు అకౌంటుకు జమ చేస్తే, రైతు డిస్కాముకు చెల్లించాలట! అవసరాన్ని బట్టి (కరెంటు సరఫరా వుంటే) పంప్‌సెట్‌ ఆన్‌ చేసుకొని పండించుకుంటున్న రైతుకు ఇప్పుడు మీటర్లు, బిల్లులు అంటూ హడావుడి చేయడమెందుకు? వ్యవసాయ విద్యుత్‌ ఖర్చంతా ఇకపైనా ప్రభుత్వమే భరిస్తే ఇంత పెద్ద కసరత్తు ఎందుకన్నది పలువురి సందేహం.
కేంద్రం ఒత్తిడి
సామాన్యులకు ఇచ్చే సబ్సిడీ తగ్గించాలని, ఉచితాలు ఎత్తేయాలని, డిస్కంలను ప్రైవేటుపరం చేయాలి వంటి మార్పులు చేసేందుకు విద్యుత్‌ చట్టం (2003)ను సవరించడానికి బిజెపి ప్రభుత్వం 2016 నుండి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే! రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలని చూశారు. చట్ట సవరణకు 2018లో, 2019 ప్రారంభంలో ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే, రెండోసారి మోడీ అధికారానికి వచ్చాక వేగం పెంచడంతోపాటు రూటు కూడా మార్చారు. చట్ట సవరణ యత్నానికి తోడు ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాలు అదనపు అప్పు తీసుకోవడానికి ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలను సడలించాలంటే విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయాలన్న షరతు విధించారు. ఆ పరంపరలో భాగంగానే మే 17న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అన్ని రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులకు లేఖలు పంపారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు సడలించి, అదనంగా అప్పులు తీసుకోవడానికి ఏమేం చేయాలో షరతులను వివరించారు.
గత ప్రభుత్వ విధానాల మూలంగానే విద్యుత్‌ సంస్థలపై భారాలు పెరిగాయనీ, గత ఐదేళ్లలో జరిగిన సోలార్‌, విండ్‌ పిపిఎ లను సమీక్షిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. కాని, వెనువెంటనే కేంద్ర విద్యుత్‌ మంత్రి లేఖ రాయడం, వివిధ కంపెనీలు కోర్టుల్లో కేసులు వెయ్యడంతో ఆ వేడి, వేగం మందగించాయి.
కేంద్రం చౌకగా విద్యుత్‌నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల నుండి అధిక ఛార్జీ వసూలు చేస్తున్నారన్న కేంద్ర ఆర్థిక మంత్రి ఆరోపణకు ముఖ్యమంత్రి లేదా మంత్రులు కాకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సమాధానం చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తే జగన్‌ ప్రభుత్వం ప్రతిఘటిస్తుందని పలువురు ఆశించారు. పంప్‌సెట్లకు మీటర్లు బిగింపు, విద్యుత్‌ నగదు బదిలీపై సెప్టెంబర్‌ 1న జిఓ 22ను జారీ చేయడంతో అది 'వొట్టి భ్రమేనా!' అని వాపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీపై జిఓ జారీ చేసిన తొలి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌ కావడం గమనార్హం. రాష్ట్ర నికర సాగు విస్తీర్ణం 145.54 లక్షల ఎకరాలకుగానూ కాలువల ద్వారా 32.19 లక్షల ఎకరాలు, బోర్లు, బావులపై ఆధారపడి 28.29 లక్షల ఎకరాలు సాగవుతోంది. కాబట్టి పంప్‌సెట్ల ద్వారా వ్యవసాయం రాష్ట్ర వ్యవసాయార్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తుంది.
జిఓలో చెప్పినా ఆచరణ ఏ రీతినో!
రాష్ట్ర ప్రభుత్వం అదనపు రుణం తీసుకోవాలంటే (జిఓ లో అదనపు నిధులు అని రాసింది) 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం (మే 17 లేఖ) నిర్దేశించింది. నెలవారీ నమోదైన బిల్లు మొత్తం ముందుగానే, ప్రభుత్వం రైతు ఖాతా లోకి జమ చేస్తుంది. అలా అందుకున్న మొత్తాన్ని రైతు తిరిగి విద్యుత్‌ కంపెనీకి చెల్లించాలి. నగదు బదిలీ పథకం అమలు కోసం గ్రామ, మండల, సబ్‌ డివిజన్‌, జిల్లా, డిస్కామ్‌, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తారు. గ్రామ, మండల కమిటీల పని ప్రధానమైనది. గ్రామ కమిటీలో గ్రామ రెవెన్యూ అధికారి అద్యక్షుడిగా, లైన్‌మ్యాన్‌ కన్వీనర్‌గా వుంటారు. వ్యవసాయ అసిస్టెంటు సభ్యుడు. మండల కమిటీకి తహశీల్దార్‌ అధ్యక్షుడు కాగా విద్యుత్‌ కంపెనీ ఇంజనీర్‌ కన్వీనర్‌. వ్యవసాయ, పంచాయతీ అధికార్లు సభ్యులు. ప్రతి గ్రామంలో కరపత్రాలు, పోస్టర్లతో ప్రచారం చేస్తారు. రైతులతో మీటింగులు జరుపుతారు. ప్రస్తుతం ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పొందుతున్న అందరు వ్యవసాయ వినియోగదారులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
గ్రామ కమిటీ రైతుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ప్రతి దరఖాస్తుకు కెవైసి, ఆధార్‌, బోరు అక్షాంశాలు, బోరు సర్వే నంబరు నమోదు చేస్తుంది. కనెక్షన్లు పూర్వపు భూ యజమానుల పేర్ల మీద వుంటే వాటిని ప్రస్తుత యజమానుల పేర్ల మీదకి పట్టాదారు పాస్‌ పుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగా మారుస్తామన్నారు. ఆ రెండు పత్రాలు అందుబాటులో లేకపోతే, గ్రామ రెవెన్యూ అధికారి ధృవీకరించిన వాంగ్మూలం ఆధారంగా పేరు మారుస్తామనీ పేర్కొన్నారు.
అయితే, ఆచరణలో చాలా ఇబ్బందులు వస్తాయి. అనధికార కనెక్షన్లు లేదా అదనపు లోడు కనెక్షన్లు వుంటే డెవలప్‌మెంట్‌ చార్జి, సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టించుకొని క్రమబద్ధీకరిస్తారు. ఇందుకు వేలల్లోనే ఖర్చవుతుంది. వ్యవసాయ కనెక్షన్‌ యజమాని పేరు, భూ యజమాని పేరు, ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా పేరు ఒకటిగా వుండేలా సరిపోలుస్తామన్నారు. ఏవైనా తేడాలుంటే ఆ రైతు అష్టకష్టాలు పడక తప్పదని అందరికీ తెలిసిందే! ఒకే పేరుతో వున్న ఆధార్‌ కార్డు సీడింగ్‌ జరగకపోతేనే రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు దక్కనివారు కోకొల్లలు. ఇక నాలుగు రికార్డులు ఒకేలా వూండాలంటే ఎన్ని అవస్థలో కదా! వాటిని సరి చేయించుకోవడానికి ఖర్చు వేలల్లో మాటే! కనెక్షను, నగదు బదిలీ, బ్యాంకు అకౌంటు అన్నీ భూ యజమాని పేరు మీదనే వుంటాయి కనుక కౌలురైతులకు ఇబ్బందులు తప్పవు.
40 ఏళ్ల తరువాత మళ్లీ మీటర్లు
పంప్‌ సెట్‌కు స్మార్ట్‌ మీటర్‌ లేదా ఇన్‌ఫ్రారెడ్‌ సమాచార ప్రామాణికం గల మీటర్‌ను బిగిస్తారు. అందుకు ఖర్చు ప్రభుత్వానిదే. మీటర్‌ రీడింగ్‌నుబట్టి బిల్లు తయారు చేస్తారు. ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా 1984లో వ్యవసాయ పంప్‌సెట్లకు శ్లాబు రేటు నిర్ణయించి, మీటర్లు తీసేశారు. చంద్రబాబు హయాంలో చార్జీలు వసూలు చేసినా మీటర్లు కొత్తవి పెట్టలేదు. వై.ఎస్‌ ఉచిత విద్యుత్‌ పథకాన్ని తెచ్చారు. ఇప్పుడు మళ్లీ మీటర్లు వస్తున్నాయి. ఇది రైతులకు బాధాకరమైన విషయం. ఒకసారి మీటర్‌ బిగిస్తే, రీడింగ్‌ ప్రకారం బిల్లు చెల్లించడం- అది నగదు బదిలీ అయినా- ఆ తరువాత కొనసాగుతుందని లేదు. అలాంటపుడు రైతు చెల్లించాల్సి వస్తుంది. యూనిట్‌ ఛార్జి పెరిగితే ఆ మేరకు సబ్సిడీ పెంచుతారో లేదో తెలియదు. పెంచకపోతే ఆ మొత్తాన్ని రైతు చెల్లించాలి. ఎల్ల కాలమూ నగదు బదిలీ వుంటుందని లేదు. ఇది జిఓ మాత్రమే. చట్టంలోనే పేర్కొన్నా రాజధాని రైతులకు కౌలు చెల్లించలేదు. ఆందోళన చేశాకే ఇచ్చారు.
ఆ ప్రాంత వాసులకు విద్య, వైద్య సౌకర్యాలూ కాగితాల మీదనే మిగిలిపోయాయి. కాబట్టి ఒకసారి మీటరు బిగించి, యూనిట్ల ప్రకారం బిల్లు చెల్లించడం మొదలు పెడితే రైతు మెడకు అది చుట్టుకుంటుంది. మే 17న కేంద్రం రాసిన లేఖ లోని షరతులను అమలు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లేఖలో విద్యుత్‌ రంగానికి సంబంధించిన మరో రెండు షరతులున్నాయి. వాటిలో సాంకేతిక, వాణిజ్య నష్టాలను లక్ష్యం మేరకు తగ్గింపు మొదటిది. విద్యుత్‌ను అందించడానికి అయ్యే ఖర్చు (కాస్ట్‌ టు సర్వ్‌)కు, వసూలు అయ్యే మొత్తానికి తేడా తగ్గించడం రెండవది. అలాగే కాస్ట్‌ టు సర్వ్‌ కన్నా ఎవరికీ 20 శాతం కంటె తక్కువకు కరెంట్‌ ఇవ్వరాదని మరో షరతు పెడుతున్నారు. ఉదాహరణకు రాష్ట్రంలో గత ఏడాది కాస్ట్‌ టు సర్వ్‌ యూనిట్‌కు రూ.6.87. అంటే ఎవరికైనాగాని యూనిట్‌కు రూ.1.37 మించి సబ్సిడీ ఇవ్వరాదు. ఇప్పుడు 50 యూనిట్లు వాడే గృహ వినియోగదారు యూనిట్‌కు రూ1.45 చెల్లిస్తున్నారు. ఇకపై వారు రూ.5.50 చొప్పున చెల్లించాలి. ఈ విధంగా షరతులు విద్యుత్‌ ఛార్జీల పెంపునకు, ఉన్న రాయితీల రద్దుకు దారి తీస్తాయి. ప్రస్తుతం ఎస్‌.సి, ఎస్‌.టి, చేనేత కార్మికులు, స్వర్ణకారులకు, క్షురకులకు, రజకులకు ఉచితంగా లేదా రాయితీపై కరెంట్‌ ఇస్తున్నారు. దోభీ ఘాట్‌లకు ఉచితంగా ఇస్తున్నారు. వీరందరికీ భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది.
కొండను తవ్వి ఎలుకను పడతారా?
సాఫీగా సాగిపోతున్న వ్యవసాయ విద్యుత్‌ విషయంలో రైతులకెందుకు కొత్త చిక్కులు తెస్తున్నారంటే రాష్ట్రానికి అదనపు అప్పులు పొందడానికేనని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నిజానికి వచ్చేదెంతో ఒక్కసారి పరిశీలిద్దాం. విద్యుత్‌ నగదు బదిలీ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తన స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో 0.15 శాతం అప్పు అదనంగా పొందవచ్చునని సదరు లేఖ లోని మూడవ పేజి 8 (3) పేరాలో పేర్కొన్నారు. మన జిఎస్‌డిపి రూ. 10,10,176 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర షరతు మేరకు 0.15 శాతం అంటే కేవలం రూ.1,515 కోట్లు. ఈ అప్పు కోసం 18 లక్షల మంది రైతులను ఇబ్బంది పెట్టాలా? అన్నది ఒక ధర్మ సందేహం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికయ్యే ఖర్చు కూడా ఎక్కువే! ఇప్పుడు సాధారణ మీటరే త్రీ ఫేజ్‌ అయితే సుమారు మూడు వేలు. అలాంటిది స్మార్ట్‌ మీటర్‌ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం బల్క్‌గా కొంటుందని, కేంద్రం సబ్సిడీ ఇస్తుందనీ అంటున్నారు. అయినా ఒక్కో మీటర్‌కు రెండు వేలైనా ఖర్చవుతుందని ఒక అధికారి చెప్పారు. అంటే 18 లక్షల మీటర్లకు రూ. 360 కోట్లు పోతుంది. పరిపాలనా పరమైన ఖర్చులు మరో రూ. వంద కోట్లనుకుంటే అదనంగా వచ్చే అప్పులో మూడో వంతు వాటికే పోతుంది. మరి రైతులకెందుకీ ఇక్కట్లు? ఎవరికి మేలు చేకూర్చడానికి?
                                                                              * బి. తులసీదాస్‌