Jul 13,2023 07:21

ప్రజాశక్తి - కడప : రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి జాప్యం లేకుండా చూసుకోవాలని అధికారులను ఎపిఎస్‌పిడిసిఎల్‌ చైర్మన్‌ కె.సంతోషరావు ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను విధిగా పాటించాలని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. కడప నగరంలోని ఐఎంఎ హాల్లో బుధవారం కడప డివిజన్‌ పరిధిలోని కడప, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు, చెన్నూరు మండలాల క్షేత్రస్థాయి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోషరావు మాట్లాడుతూ.. లైన్లలో తిరగాలని, సమస్యలను గుర్తించాలని, ముందస్తు మరమ్మతులు చేపట్టాలని, నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం ప్రజలకు అందించాలని, రైతులకు కొత్త వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్తు సేవలు నిర్దేశిత సమయంలో వినియోగదారులకు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాలను, లూజు లైన్లను ఎప్పటికప్పుడు సరిచేయాలన్నారు. కడప డివిజన్‌ పరిధిలో అత్యధికంగా విద్యుత్‌ బకాయిలున్నాయని, వసూలుపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు ధర్మన్న, గురవయ్య, ఒఎస్‌డిఎస్‌ శ్రీనివాసులు, ఎస్‌ఇ ఎస్‌.రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.