ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిల అందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టిలకు ఉచిత విద్యుత్ అమలుపై కెవిపిఎస్ క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా విజయవాడలోని ఎల్‌బిఎస్ నగరంలో పర్యటించి దళిత కుటుంబాలతో కెవిపిఎస్ సభ్యులు మంగళవారం మాట్లాడారు. అండ్ర మాల్యాద్రితోపాటు కెవిపిఎస్ నాయకులు సిహెచ్ శ్రీనివాస్, వెంకటరెడ్డి, కటారి సతీష్, రమణ, రజని తదితరులు సర్వేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగం బిల్లులపై పలువురితో మాట్లాడారు. ఎస్‌సిలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్‌లను తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని పలు కుటుంబాలు వారి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మాల్యాద్రి పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఉన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వైసిపి ప్రభుత్వం ఎత్తివేసే కుట్రలను సంఘటితంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజన కుటుంబాలకు వెలుగులు లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడున్న 200 యూనిట్లను 300 యూనిట్లకు పెంచి అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు ఉన్న ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.










