
- వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : విద్యుత్ భారాలు తగ్గించాలని, ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేయాలని, విద్యుత్ చట్ట సవరణను ఆపాలని, స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ భవన్, కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. భారాలు తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. విద్యుత్తు రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తోన్న సంస్కరణలను ప్రతిఘటించాలని పలువురు నాయకులు కోరారు.
కర్నూలులో విద్యుత్ భవనం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకొస్తే కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన సిఎం జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అరుసార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.వందల కోట్ల భారాలు వేశారని విమర్శించారు. ఇంధన సర్దుబాటు ఛార్జీ పేరుతో 2014-15 నుండి 2018-19 సంవత్సరంలో యూనిట్‌కు ఏడు పైసలు 18 నెలలపాటు వసూలు చేశారని, 2020-21 సంవత్సరంలో వాడిన కరెంటుకు ఇంధన సర్దుబాటు ఛార్జీ పేరుతో యూనిట్‌కి 23 పైసలు చొప్పున పెంచారని, మళ్లీ ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ నెలలో వాడిన కరెంటుకు ఇంధన సర్దుబాటు ఛార్జీ పేరుతో యూనిట్‌కు 40 పైసల చొప్పున కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దుర్మార్గమన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ట్రిబుల్ షాక్ ఇచ్చిందని విమర్శించారు.
విశాఖలోని మల్కాపురం, చినగంట్యాడ విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నగరంలోని విద్యుత్ సౌధా వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమంలో జివిఎంసి 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న విద్యుత్ భారాలను ప్రతిఘటించాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని ఎపిఇపిడిసిఎల్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద, విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్‌టిఆర్ బొమ్మ సెంటర్, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు మండలాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బస్టాండ్ వద్ద ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. మండల కేంద్రమైన పెంటపాడులో వామపక్షాల ఆధ్వర్యాన కరపత్రాలు పంపిణీ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలకు షాక్ ఇస్తున్నాయన్నారు.