Dec 09,2022 21:47
  • అమృత్‌ సంస్కరణల్లో భాగం
  • 33 నగరాల్లో అమలుకు ప్రణాళిక

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించినట్టుగానే, ఇళ్లలోనూ నీటి మీటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ప్రాధమిక కసరత్తు ఇప్పటికే పూర్తయింది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఈ దిశలో చర్యలు కూడా ప్రారంభమైనాయి. మిగిలిన కార్పొరేషన్లలో కూడా సాధ్యమైనంత త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో లక్షలమందికి పైబడి నివాసం ఉంటున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ఇళ్లలో నీటి మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 33 నగరాలు, పట్టణాలు నీటిమీటర్లు ఉనికిలోకి రానున్నాయి. ఇప్పటికే చెత్తపన్ను, ఆస్తిపన్ను పెంపుతో సతమతమౌతున్న పట్టణవాసులకు నీటి మీటర్ల ఏర్పాటు మరింత అదనపు భారం కానుంది.

  • ఇప్పుడే ఎందుకు?

అప్పుల కావాలన్నా, ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు సడలించాలన్నా నీటమీటర్లను బిగించి తీరాలని కేంద్రం నిబంధన విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో చర్యలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు సంస్కరణల అమల్లో భాగంగా ప్రారంభించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకాన్ని బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అమృత్‌(అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) పేరుతో కొనసాగిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనే అమృత్‌, స్మార్ట్‌ నగరాలను ఎంపిక చేశారు. అప్పుల కోసం వైసిపి ప్రస్తుతం అమలు చేస్తోంది.

  • పెను భారమే...

అమృత్‌ పథకంలో ప్రతి కుటుంబానికి రోజుకు 135 లీటర్ల పరిమితి విధించారు. అంతకు మించి వాడుకుంటే జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను అమృత్‌ 2.0లో స్పష్టంగా పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో నాన్‌ రెవెన్యూ వాటర్‌ వినియోదగాన్ని 20 శాతానికి తగ్గాలని అందులో షరతు విధించారు. 2009లోనే విజయవాడ నగరంలో 2.54 లక్షల నీటిమీటర్లు బిగించాలని అంచనా వేయగా సిపిఎం, ప్రజా సంఘాలు పెద్దఎత్తున అడ్డుకున్నాయి. అయితే వాణిజ్య, అపార్టుమెంట్లకు మీటర్లు బిగించేశారు. అనంతరం ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్‌ ఇస్తామనే పేరుతో అన్ని ఇళ్లకూ నామమాత్రపు ఫీజు తీసుకుని నీటి కుళాయిలు బిగించారు. అదే సమయంలో పబ్లిక్‌ కుళాయిలు మొత్తం తొలగించారు. బోర్లు వేయడాన్ని నిలిపేశారు. పాడైన బోర్లను బాగు చేయించడమూ మానేశారు. ఇప్పుడు అమృత్‌ పథకం నిబంధనల్లోని మిగిలిన వాటి అమలుకు నిర్ణయించారు. మొదటి విడతలో 10.25 లక్షల మీటర్లు బిగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

  • ప్రజలపై పెనుభారమే : పట్టణ పౌర సంక్షేమ సంఘాల కన్వీనర్‌ బాబూరావు

నీటిమీటర్లు పెట్టడం చట్ట వ్యతిరేకం. గతంలో పెట్టాలని చూసిన సమయంలోనే సిపిఎం, ప్రజా సంఘాల పక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాటం చేయడంతో పాలకులు నిలిపేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గేలా లేదు. అప్పుల కోసం ప్రజావ్యతిరేక షరతులు అమలు చేస్తోంది. దీన్ని పూర్తిగా అడ్డుకోవాలి. లేనిపక్షంలో ప్రజలపై పెనుభారాలు పడే ప్రమాదం ఉంది. విజయవాడలో ఇప్పటికే మీటర్లు బిగించడం మొదలుపెట్టారు. సిపిఎం పక్షంగా తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అడ్డుకుంటాము.