Nov 02,2023 07:43

ముడి పచ్చడిలో కారం, కాసిన్ని నీళ్లు కలిపి అన్నంలో తింటే కూడా రుచిగానే ఉంటుంది. చివరాకరుకు అదీ అడుగంటితే నీటి కూడు కడుపు నిండా తాగి లేచిపోయే జనానికి... ఉప్పు, సప్ప నీరు దిక్కయితే అదెంత విషాదమో కదా. ప్రభుత్వాలకు సిగ్గనిపించకపోయినా ఇది నిజం. నిన్నమొన్నటి వరకు బావి, చెరువు అడుగుల నీరు తేరు పట్టి గొంతు తడుపుకున్న పల్లెలు నేడు రోజువారీ స్నానం, ఇతర ఇంటి అవసరాల కోసం అదే పరిస్థితిని ఎదుర్కొం టున్నాయి. చేలల్లో, పంట కాలవల్లో ఒళ్లు కడుక్కుని వచ్చి బట్టలు మార్చుకుని స్నానాన్ని సరిపుచ్చే అవకాశాన్ని కూడా నేడు మెట్ట సాగు దూరం చేసింది. చౌడు, కుంటలు, డొంకలు పూడ్చి కాలనీలు కడుతున్న ప్రభుత్వాలు అక్కడి భూగర్భ జలాల లభ్యత, నాణ్యతను పట్టించుకోవు. ప్రాణాధారమైన నీటి సౌకర్యం పట్ల చిన్న చూపు వివక్ష కిందకే వస్తుంది. నేడు ఎక్కువ శాతం భూగర్భ జలాలే నీటి అవసరాలు తీర్చు తున్నాయి. అవన్నీ ఉప్పలు, సప్పులు. అక్కడక్కడా చెరువులు, నదులు నీరు అందుబాటులో ఉన్నా శుద్ధి చేయడం మానేసి ముడి నీటి సరఫరానే చేస్తున్నాయి పంచాయితీలు. మట్టి, బురద, ఎరువులు, పురుగు మందుల రంగు, రుచి, వాసనే గ్రామీణ ప్రజల గుర్తింపుగా మారిపోయింది. కొత్తగా భవన నిర్మాణ కూలీలు సిమెంటు, సున్నం, ఇసుక, ఇటుకలు విదిల్చిన దువ్వ కొట్టుకుని రూపు రేఖల్నే మర్చిపోయారు. ప్రతీ రోజు ఒంటిని, ఒంటికి వేసుకునే దుస్తులను శుభ్రం చేయడం దాదాపు మొక్కుబడి వ్యవహారంగా మారిపోయింది. ఈ అసౌకర్యం శారీరక శ్రమ పట్ల గౌరవాన్ని, ఆసక్తిని, సంతృప్తిని చంపేస్తోంది. చమట వాసనను కూడా తొలగించలేని నీరు శ్రమ జీవులను మట్టి, మురికి, మసి మనుషులుగా మార్చి తరతరాలకు వారసత్వంగా అందిస్తోంది. నాణ్యమైన జీవితాన్ని సాకారం చేయడంలో నాణ్యమైన ఆహారం, విద్య, వైద్యం, నీరు ప్రధాన భూమిక పోషిస్తాయని ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియదనుకోలేం. మనిషి అవసరాల్లో నీరే తొలి ప్రాధాన్యం. ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ఆలోచించడమే విషాదం.
- ఎన్కే రావు,
బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్‌