Aug 22,2023 08:22
  • వర్షాభావంతో వట్టిపోయిన చెరువులు
  • ఖాళీగానే సాగునీటి ప్రాజెక్టులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 22 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు జిల్లాల్లో మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పార్వతీపురం, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం వుంది. ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్ట్‌ నెల చివరకు వచ్చినా రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులతో చెరువులు దాదాపు ఖాళీ అవుతున్నాయి.
          ప్రధాన ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. దీంతో ఈ ఏడాది వ్యవసాయంతో పాటు, తాగునీటికి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 44శాతం లోటు వుంటే ఆతర్వాత కడప జిల్లాలో 42శాతం, అన్నమయ్య, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 39శాతం, నెల్లూరులో 37శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్ర సగటు 26శాతం తక్కువ వర్షపాతం వుండటంతో ఈ ప్రభావం సాగునీటికే కాదు ప్రజలకు, పశువులకు తాగునీటి వనరులుగా వున్న చెరువులు బోసిపోయిన పరిస్థితి వుంది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న చెరువుల్లో ఇప్పటిదాకా కేవలం 48శాతం నీరు మాత్రమే చేరింది. చెరువుల్లో 52శాతం నీటి లభ్యత తక్కువగా వుంది. అలాగే ప్రధాన ప్రాజెక్టులు అయిన శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆందోళనకరంగా వుంది. గత ఏడాది శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిస్థాయి సామర్థ్యంతో కళకళగా వున్న పరిస్థితి వుంటే ఈ ఏడాది డెడ్‌ స్టోరేజ్‌ స్థాయిలకు మించి నీటిమట్టాలు పెరగని పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215 టిఎంసీలు కాగా ప్రస్తుతం 105 టిఎంసీలు మాత్రమే వుంది. నాగార్జునసాగర్‌ 312 టీఎంసీలకు గాను 151 టిఎంసీలు మాత్రమే వుంది. నెల్లూరు జిల్లాలోని సోమశిల 78 టిఎంసీలకు గాను 19.7 టిఎంసీలు, కండలేరులో 68 టిఎంసీలకు గాను 15.2 టిఎంసీలు, పల్నాడు జిల్లాలోని పులిచింతల రిజర్వాయర్‌లో 45.7 టిఎంసీలకు గాను 25టిఎంసీలు మాత్రమే వున్నాయి. కడపజిల్లాలోని గండికోట రిజర్వాయర్‌లో మాత్రము 26.8టిఎంసీలకు గాను 19.39 టిఎంసీలు వున్నాయి.
           బ్రహ్మంసాగర్‌లో 17.7టిఎంసీలకు గాను 8.4 టిఎంసీలు వుంది. అలాగే నంద్యాల జిల్లాలోని వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 16.9 టిఎంసీలు కాగా ఇపుడు 6.9 టిఎంసీలు మాత్రమే వున్నాయి. అలాగే గోరుకల్లు రిజర్వాయర్‌లో 12.44టిఎంసీలకు గాను 4.7 టిఎంసీలు, అవుకులో 4.1కుగాను 1.2 టిఎంసిలు, కర్నూలు జిల్లాలోని గాజులదిన్నె ప్రాజెక్టులో 4.5టిఎంసీలకు గాను 1.1 టిఎంసీలు, సత్యసాయి జిల్లాలోని పిఎబిఆర్‌లో 11.1 టిఎంసీలకు గాను 2.4టిఎంసీలు, అనకాపల్లిలోని తాండవ రిజర్వాయర్‌లో 4.9 టిఎంసీలకుగాను 2.9 టిఎంసీలు మాత్రమే వుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీటిని అందించే ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా వుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాభావ పరిస్థితులకు తోడు చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిలభ్యత లేకపోవడంతో భూగర్భ జలమట్టాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.