Apr 10,2023 12:30

మోడి ప్రభుత్వ విధానానికి అనుగుణంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఎపి ఇపిడిసిఎల్‌ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్లో అమలు చేశారు. దీనివల్ల దాదాపు 30 శాతం మేరకు వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తక్కువగా నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ప్రచారం చేసింది. ఈపధకం అమలు వల్ల శ్రీకాకుళం సర్కిల్లో మీటర్లు ఏర్పాటుకు ముందు, ఏర్పాటు తరువాత విద్యుత్‌ వినియోగంలో వచ్చిన తేడా, మీటర్లు పనిచేస్తున్న తీరు, ఈ కార్యక్రమం అమలు వల్ల ఒనగూరే లాభనష్టాల అంచనాలు, మీటర్ల కొనుగోలు, ఏర్పాటు, నిర్వహణకు అవుతున్న వ్యయానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని 2023-24 సంవత్సరానికి విద్యుత్‌ పంపిణీ కంపెనీల వార్షిక ఆదాయ అవసరాలు, ఛార్జీల ప్రతిపాదనలపై చేసిన నివేదనలలో కోరాము. ఈ అంశాలకు ఇపిడిసిఎల్‌ సమాధానాలను దాటవేసింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసి, నేరుగా రైతులకు సబ్సిడీ అందించే (డిబిటి) కార్యక్రమం అమలు వల్ల చేకూరతాయంటున్న ప్రయోజనాలనబడే వాటిని ఇపిడిసిఎల్‌ తన సమాధానాలలో ఏకరువు పెట్టింది.
          2022-23 సంవత్సరానికి ఇచ్చిన వివరణలో, శ్రీకాకుళం సర్కిల్లో 25,439 వ్యవసాయ సర్వీసులకు మీటర్లు ఏర్పాటు చేసినట్లు, మిగిలిన నాలుగు జిల్లాల్లో 2,07,920 వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసే పనిని, అవసరమైన సామాగ్రితో అవార్డు చేసినట్లు డిస్కాం తెలిపింది. స్మార్ట్‌ మీటర్ల వల్ల వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుతుందని డిస్కాం ఎక్కడా పేర్కొన లేదు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని (కొంత క్రాస్‌ సబ్సిడీని కలిపి) సమకూర్చి అమలు చేస్తున్నది. ఎపిఇఆర్‌సి అనుమతించిన ఐఎస్‌ఐ విధానం మేరకు వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని డిస్కాంలు లెక్కిస్తున్నాయి. కమిషన్‌ వాటిని పరిశీలించి, ఏ మేరకు వ్యవసాయ విద్యుత్‌ వినియోగం అవుతుందో ప్రతి ఏటా ఛార్జీల ఉత్తర్వులలో నిర్ధారిస్తున్నది.
           రోజుకు నిర్ణీత తొమ్మిది గంటల కాలంలో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వ్యవసాయ ఫీడర్లకు ఏర్పాటు చేసిన మీటర్లలో నమోదైన వినియోగం ఆధారంగా వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని సగటున డిస్కాంలు లెక్కగడుతున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ వినియోగం వ్యవసాయ సర్వీసుల సంఖ్య, వాటి మోటార్ల సామర్ధ్యం, భూగర్భ జలాలు ఎంత లోతులో, ఏ మేరకు లభ్యమవుతాయి, అవి లభ్యమయ్యే బోరుబావులు, కాలువలు, వర్షపాతం, తదితర వనరులపై ఆధారపడి ఉంటుందని ఇపిడిసిఎల్‌ పేర్కొంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నందున, వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఏర్పాటును ప్రభుత్వ నిర్ణయం మేరకు డిస్కాంలు చేపడుతున్నాయని ఎపిఇఆర్‌సి పేర్కొంది. డిబిటి పధకం అమలుకు వినియోగాన్ని లెక్కగట్టేందుకు ఎల్‌టి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు డిస్కాంలు పేర్కొన్నాయి.
         వ్యవసాయ పంపుసెట్లకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీటర్ల ఏర్పాటుకు అనుకూలంగా చేస్తున్న సాంకేతిక వాదనలు ఏమైన్పటికీ, దానివల్ల చేకూరే ప్రయోజనమేమిటనేది ప్రధానం. శ్రీకాకుళం సర్కిల్లో ఈ కార్యక్రమం అమలు వల్ల ప్రయోజనం చేకూరినట్లు నిర్ధారణ కాలేదు. ఇపిడిసిఎల్‌ అధికారిక గణాంకాల ప్రకారమే, 2020-21లో, 2021-22లో సర్కిల్‌ వారీగా ఎల్‌టి వ్యవసాయ విద్యుత్‌ వినియోగం (మి.యూ.) వివరాలు ఇలా ఉన్నాయి: (పట్టికలో చూడొచ్చు)
మీటర్లు ఏర్పాటు చేసిన శ్రీకాకుళం సర్కిల్లోనే గాకుండా, మీటర్లు ఏర్పాటు చేయని ఏలూరు సర్కిల్లో కూడా వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, శ్రీకాకుళం జిల్లాలో పై రెండు సంవత్సరాలలో వరి పండించిన విస్తీర్ణం 13800 - హెక్టార్ల నుండి 7,600 హెక్టార్లకు తగ్గగా, వేరుశనగ వేసిన విస్తీర్ణం 4000 హెక్టార్ల నుండి 5800 హెక్టార్లకు పెరిగింది. మొక్కజొన్న వేసిన విస్తీర్ణం యథాతథంగా 14000 హెక్టార్లుగా ఉంది. జనుము వేసిన విస్తీర్ణం అదనంగా 13000 హెక్టార్లుగా నమోదయింది. అదనంగా 6000 హెక్టార్లలో నువ్వుల విస్తీర్ణం పెరిగింది. వ్యవసాయానికి నీటి వినియోగం తక్కువగా అవసరమైన పంటలను ఎక్కువగా వేయటం వల్ల శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గింది. ఇదేకాలంలో ఇపిడిసిఎల్‌ పరిధిలోని అయిదు సర్కిళ్లలో వ్యవసాయేతర విద్యుత్‌ వినియోగం పెరగగా, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో పంపిణీ నష్టాల శాతం కొంత పెరిగింది.
        2022-23లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు కమిషన్‌ అనుమతించిన దానికన్నా మూడు డిస్కాంలలో వినియోగం తగ్గింది. ఇపిడిసిఎల్‌లో ఈ వినియోగం కమిషన్‌ అనుమతించిన 2715.35 మి.యూ. నుండి 2330.05 మి.యూ.కు (14.19 శాతం) తగ్గగా, ఎస్‌పిడిసిఎల్‌లో 7755.31 మి.యూ. నుండి 5909.63 మి.యూ.కు (23.80 శాతం), సిపిడిసిఎల్లో 2078.85 మి.యూ. నుండి 1962.76 మి.యూ.కు (5.58 శాతం) తగ్గిందని అంచనా.. ఇక్కడ కూడా ఇపిడిసిఎల్‌ కన్నా ఎస్‌పిడిసిఎల్‌లో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుదల శాతంగా కూడా ఎక్కువగా ఉంది.

22


       2023-24లో కొత్తగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ఎస్‌పిడిసిఎల్‌ 58013 మేరకు, సిపిడిసిఎల్‌ 50909 మేరకు, ఇపిడిసిఎల్‌ 14099 మేరకు ఇస్తామని ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాను డిస్కాంలు ప్రతిపాదించిన దానికన్నా కమిషన్‌ తగ్గించింది. ఎస్‌పిడిసిఎల్‌ ప్రతిపాదించిన 6352.86 మి.యూ.ను 5909.63 మి.యూ.కు తగ్గించింది. సిపిడిసిఎల్‌కు సంబంధించి 2149.24 మి.యూ. నుండి 1962.76 మి.యూ.కు, ఇపిడిసిఎల్‌కు 2446.55 మి.యూ. నుండి 2330.05 మి.యూ.కు తగ్గించింది. 2023-24లో ఎస్‌పిడిసిఎల్‌ కొత్తగా 59018 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసు కనెక్షన్లను ఇస్తామని ప్రతిపాదించగా, సిపిడిసిఎల్‌ 50909 కనెక్షన్లను, ఇపిడిసిఎల 14099 కనెక్షన్లను ఇస్తామని ప్రతిపాదించాయి. మీటర్ల ఏర్పాటు, ఎస్‌పిడిసిఎల్‌ ఇచ్చే కొత్త కనెక్షన్లలో దాదాపు నాల్గవ వంతు మాత్రమే కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నా, ఇపిడిసిఎల్‌ వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తగ్గుదల శాతంగా కూడా ఎస్‌పిడిసిఎల్‌ తగ్గుదల కన్నా చాలా తక్కువగా ఉంది. మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వినియోగం అంచనాలు కచ్చితంగా లెక్కగట్ట గలుగుతామని ఈ పధకం మద్దతుదారులు వాదిస్తున్నా, ఆ లెక్కలను బట్టి తక్కువ వినియోగం జరుగుతున్నదని నిర్ధారించే పరిస్థితి ఆచరణలో నిర్ధారణ కావటం లేదు. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వథాగా ఖర్చు చేసి, ఈ పథకాన్ని అమలు చేయటం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తయారవుతున్నది.

- ఎం. వేణుగోపాలరావు