పుదీనా కారప్పూస
కావాల్సిన పదార్థాలు : పుదీనా - కట్ట, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి - అరకప్పు, కారం - పెద్ద చెంచా, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు చెంచా, వెన్న - పెద్ద చెంచా, నూనె- తగినంత.
తయారుచేసే విధానం : పుదీనా ఆకులని మిక్సీజార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దలో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, కారం, ఇంగువ వేసి, మెత్తగా చక్రాల పిండిలా కలుపుకోవాలి. చివరిగా వెన్న వేసుకుని, పిండిని మరోసారి కలుపుకోవాలి. పాన్‌లో నూనె పోసి, వేడి చేసుకోవాలి.
చక్రాల గిద్దెలో సన్నకారప్పూస చేసుకునే ప్లేట్ పెట్టుకుని ఈ పిండిని ఒత్తుకోవాలి. తక్కువ మంట మీద వేయించుకోవాలి. పుదీనా కారప్పూస చక్కని రుచి, పరిమళంతో తినడానికి అద్భుతంగా ఉంటాయి.
లడ్డూ
కావాల్సిన పదార్థాలు : నెయ్యి - ముప్పావు కప్పు, శనగపిండి - కప్పు, పంచదార- అరకప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్.
తయారుచేసే విధానం : పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి, వేడెక్కిన తర్వాత శనగపిండిని వేస్తూ నెమ్మదిగా కలియబెట్టాలి. చిన్నమంటపైనే కమ్మని వాసన వచ్చే వరకూ వేగించాలి. శనగపిండి రంగు మారే వరకూ వేగించిన తరువాత గ్యాస్ మీద నుంచి పాన్‌ను దింపుకోవాలి. తర్వాత శనగపిండిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అందులో పంచదార, యాలకుల పొడి వేసి కలపాలి. అరచేతిలోకి పిండి తీసుకుంటూ లడ్డూలు చుట్టుకుంటూ పక్కన పెట్టుకోవాలి.
మటన్ బిర్యానీ
కావాల్సిన పదార్థాలు : బాస్మతి రైస్- కేజీ, మటన్- కేజీ, పెరుగు- 200 గ్రాములు, నిమ్మరసం- మూడు టీస్పూన్లు, కారం పొడి- 20 గ్రాములు, ధనియాల పొడి- 30 గ్రాములు, అల్లంవెల్లుల్లి పేస్ట్ - 100 గ్రాములు, ఉప్పు- 50 గ్రాములు, గరంమసాలా పొడి- 20 గ్రాములు, నూనె - 100 గ్రాములు, వేగించిన ఉల్లిపాయ ముక్కలు (సన్నగా నిలువుగా కోసినవి) - 30 గ్రాములు, జీడిపప్పు (వేయించి) - కొద్దిగా, కొత్తిమీర తరుగు - 15 గ్రాములు, పుదీనా తరుగు - 15 గ్రాములు, బిర్యానీ ఆకులు- ఐదు గ్రాములు, డాల్డా / నెయ్యి- 150 గ్రాములు, నీళ్లు- ఐదు లీటర్లు.
తయారుచేసే విధానం : మటన్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, నూనె వేసి బాగా కలిపి రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఆ తర్వాత పెద్ద గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి, గరంమసాలా, బిర్యానీ ఆకులు వేయాలి. ఎసరు ఉడుకుపట్టగానే కడిగిపెట్టుకున్న బాస్మతి బియ్యం వేయాలి. బియ్యం సగం ఉడికాక ఎసరు వంపేయాలి. ఫ్లాట్‌గా ఉన్న గిన్నె తీసుకుని అందులో ముందుగా కలిపిపెట్టుకున్న మటన్‌ను ఒక పొరలా వేయాలి. ఆ తర్వాత సగం ఉడికిన బియ్యాన్ని వేసి, పైన నెయ్యి వేయాలి. ఈ గిన్నెను సన్నటి మంట మీద 25 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా గిన్నెను, మూతను కలిపి మైదాతో మూసేయాలి. మండుతున్న బొగ్గులు మూత మీద వేయాలి. 20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనా తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించి తింటే రుచి అమోఘం అనాల్సిందే.