Apr 30,2023 20:30

- నేటి బాలలే రేపటి జాతి సంపద : ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు:
హేలాపురి వేసవి ఉత్సవం ఏలూరులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. గవరవరంలోని సెయింట్‌ థెరిస్సా మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యాన తొలి హేలాపురి వేసవి ఉత్సవ కార్యక్రమాలు ఆదివారం పెద్దఎత్తున సాగాయి. ప్రారంభ సభకు హేలాపురి వేసవి ఉత్సవం అధ్యక్షులు కస్తూరిరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ.. ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, మానవత, వివిధ రోటరీ, లైన్స్‌ క్లబ్‌లు ప్రతియేటా నిర్వహిస్తున్న బాలల పండుగలు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయన్నారు. ఈ ఉత్సవాల్లో చిన్నారులు ప్రదర్శిస్తున్న హావభావాలు చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుందని తెలిపారు. నేటి బాలలు రేపటి జాతి సంపదని, వారికి పెద్దలు, దేశం, సమాజం పట్ల బాధ్యతను నేర్పుతూ పెంచాలన్నారు. పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను ప్రభుత్వాలు అందించడం ద్వారా భవిష్యత్తుకు మంచి సమాజాన్ని అందించగలుగుతామని తెలిపారు. హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి అడుసుమిల్లి నిర్మల, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, సెయింట్‌ థెరిస్సా మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ మరియట్ట తదితరులు పాల్గన్నారు. తొలుత జాతీయ పతకాన్ని ఎమ్మెల్సీ సాబ్జీ ఆవిష్కరించారు. హేలాపురి వేసవి ఉత్సవంలో ఎల్‌కెజి, యుకెజి పిల్లలు మొదలుకొని సీనియర్‌ సిటిజన్లు ఎంతో ఆనందంగా వివిధ పోటీల్లో పాల్గొన్నారు.