- 1100 మంది పోలీసులతో పహారా
- అగ్గి దివిటీలు, ఇనుప రింగులు తొడిగిన కర్రలపై నిషేదం
- దేవరగట్టులో ఈసారైనా కర్రల సమరం ఆగేనా?
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి:కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన బన్ని ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు జరగనున్నాయి. హోళగుంద మండలం దేవరగట్టులో నిర్వహించే బన్ని ఉత్సవాల్లో రక్తం చిందకుండా ఆపేందుకు పోలీసులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు 1100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అగ్గి దివిటీలు, ఇనుప రింగులు తొడిగిన కర్రలను నిషేధించారు. ఇప్పటికే 800 రింగులు తొడికిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. దేవరగట్టు కొండ పరిసర ప్రాంతాలైన సులువాయి, మునానుగుంది, అరికెర, కొండపైకి వెళ్లే దారిలోని బిలేహల్ వంటి పది చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలకు కొండ దగ్గరకు అనుమతించడం లేదు.
24న కర్రల సమరం
బన్నీ ఉత్సవాల్లో విజయదశమి రోజు (ఈ నెల 24వ తేదీ) అర్ధరాత్రి కర్రల సమరానికి సమాయత్తమవుతున్నారు. ప్రతియేటా ఈ సమరంలో కర్రలు కరాళ నృత్యం చేస్తుంటాయి. ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి వేలాది మంది కర్రలతో సమరానికి సై అంటూ రంగంలోకి దిగుతారు. దేవరగట్టు కొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. కొండపై ఉన్న మాలమల్లేశ్వస్వామికి దసరా పండగ రోజు అర్ధరాత్రి కల్యాణం జరుగుతుంది. అనంతరం మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ విగ్రహాలకు నెరణికి, నెరణికి తండా, కొత్తపేటకు చెందిన మూడు గ్రామాల ప్రజలు రక్షణగా నిలుస్తారు. ఒక గ్రూపువారు విగ్రహాలను తీసుకెళ్తుంటే, మరో గ్రూపు వారు ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు గ్రూపుల మధ్య కర్రల సమరం నడుస్తుంటుంది. అనంతరం విగ్రహాలను తిరిగి దేవరగట్టు మీద ఉంచడంతో ఉత్సవం పూర్తవుతుంది. కర్రల సమరంలో వందలాది మంది తలలు పగులుతుంటాయి. కర్రలతో కొట్టుకోకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని అధికారులు ప్రతి ఏడాదీ ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ కర్రల సమరం ఆగింది లేదు. గతేడాది కూడా 98 మందికి గాయాలయ్యాయి. ఈ ఏడాదైనా తెర పడుతాందా లేదా అనేది వేచిచూడాలి.