
శ్రీనగర్ : ఆరు పార్టీలతో ఏర్పడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పిఎజిడి)కు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అధ్యక్షుడుగా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నేత మెహబూబా ముఫ్తి ఉపాధ్యక్షురాలిగా వుంటారని సీనియర్ నేత ఒకరు శనివారం తెలిపారు. శ్రీనగర్‌లో ముఫ్తీ నివాసంలో కూటమి సభ్యుల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశంలో ఎన్‌సి ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. నెలరోజుల్లోగా ఒక డాక్యుమెంట్ రూపొందిస్తామని, ప్రస్తుతం ప్రచారమవుతున్న అసత్యాలవెనుక గల వాస్తవాలను అందులో వెల్లడిస్తామని, అమరులైన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇదొక నివాళిగా వుంటుందని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోనె చెప్పారు. సిపిఎం నేత మహ్మద్ తరిగామి అలయన్స్ కన్వీనర్‌గా, సజ్జాద్ లోనె ప్రతినిధిగా వుంటారు. పీపుల్స్ అలయన్స్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి), పీపుల్స్ కాన్ఫరెన్స్ (పిసి), సిపిఎం, పీపుల్స్ మూవ్‌మెంట్ (పిఎం), అవామి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎఎన్‌సి)లు వున్నాయి.
దేశానికి వ్యతిరేకం కాదు: ఫరూక్
ఈ నెల ప్రారంభంలో ఈ ఆరు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించుకునేందుకు శాంతియుతంగా పోరాడాలని నిర్ణయించాయి. ''మేం బిజెపికి వ్యతిరేకం, అంతేకానీ దేశానికి వ్యతిరేకం కాదు.'' అని ఫరూక్ అబ్దుల్లా శనివారం సమావేశానంతరం వ్యాఖ్యానించారు. ఇదేమీ జాతి వ్యతిరేక సమావేశం కాదని అన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజల హక్కులు కాపాడాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. మతం పేరుతో మమ్మల్ని విభజించే ప్రయత్నాలు విఫలమవుతాయి, ఇదేమీ మతపరమైన పోరాటం కాదని అన్నారు.