
ముంబయి : మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (ఎంవిఎ) ఐక్యంగానే ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్ పేర్కొన్నారు. సోమవారం బారామతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. ఎంవిఎ భాగస్వామ్యుల్లో ఎలాంటి గందరగోళం లేదని.. తామంతా ఐక్యంగా ఉన్నామని అన్నారు. ఎంవిఎస్‌ను వీడి రాష్ట్ర, జాతీయస్థాయిలో బిజెపితో పొత్తు పెట్టుకున్న వర్గాలతో ఎన్‌సిపికి ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. పరోక్షంగా అజిత్ పవార్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే ఇదే ప్రశ్న అడుగుతూ గందరగోళం సృష్టించవద్దని మీడియాకి సూచించారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' తదుపరి సమావేశాన్ని ముంబయిలో ఈ నెల 31న గాని, సెప్టెంబర్ 1న గాని విజయవంతంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తాను, ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధక్షుడు నానాపటోల్ ఇండియా సమావేశ నిర్వహణా బాధ్యతలను చేపట్టామని అన్నారు. ముంబయిలోని లగ్జరీ హోటల్‌లో ఈ సమావేశం జరగనుందని చెప్పారు.
శరద్ పవార్ తన మేనల్లుడు, తిరుగుబాటు నేత అజిత్‌పవార్‌తో పూణెలో సమావేశమయ్యారు. దీంతో ఎంవిఎస్ కూటమిలో చీలికలు వచ్చాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.