
ముంబయి : అవినీతి నాయకులపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎన్‌సిపి నాయకులు శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. ఎన్‌సిపి నుంచి చీలిపోయిన కొంత నేతలను ఉద్దేశించి శరద్‌పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్‌సిపి నేతలపై ప్రధానమంత్రి స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారని శరద్ పవర్ గుర్తు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రధానమంత్రి చేతుల్లోనే ఉన్నందున సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నాసిక్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో శరద్ పవార్ ఈ విధంగా ప్రసంగించారు. ఎన్‌సిపిలో చీలిక తెచ్చి అజిత్ పవార్. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీని తిరిగి నిర్మిస్తానని శరద్ పవార్ శపథం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. అజిత్ పవార్ గ్రూపులోని ఛగన్ భుజ్‌బల్ సొంత నియోజకవర్గమైన యోలా నియోజకవర్గంలో బహిరంగసభలో ప్రజలనుద్దేశించి శరద్‌పవార్ మాట్లాడారు. ''భోపాల్‌లో బిజెపి బూత్ స్థాయి వర్కర్ల సమావేశంలో ప్రధాని మోడీ ఎన్‌సిపి నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. రూ.70 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరుతున్నా' అని శరద్ పవార్ అన్నారు. అలాగే , తన వయసు గురించి ఇంకోసారి ఎవరూ మాట్లాడొద్దని శరద్ పవార్ హెచ్చరించారు. పార్టీ కార్యకర్తల కోసం చివరి వరకు పని చేస్తానని చెప్పారు. కొందర్ని నమ్మి తాను తీవ్రంగా మోసపోయానంటూ భుజ్‌బల్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.