- ఏడాదికేడాదికి తగ్గుతున్న సేకరణ లక్ష్యాలు
- వేధిస్తున్న గోనె సంచుల కొరత
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ధాన్యం కొనుగోలు చుట్టూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒక వైపు ప్రభుత్వం ధాన్యం సేకరణ లక్ష్యాలను ఈ ఏడాది కుదించింది. మరో వైపు నవంబరు మొదటి వారం వచ్చినా నేటికీ ఇ-క్రాప్, ఇకెవైసి పూర్తికాలేదు. మరో వైపు గన్నీబ్యాగులు కొరత వేధిస్తోంది. వెరసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. ఇ క్రాప్ నమోదు ఈనెల 9నాటికి తుది జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు జిల్లా స్ధాయి అధికారులను ఆదేశించారు.
రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోలు లక్ష్యాలను ఏడాదికేడాదికి తగ్గిస్తోంది. గతానికంటే ఈ ఏడాది వర్షాలు అధికంగా పడిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు గతంలో కంటే ఈ ఖరీఫ్‌లో అధికంగా సేకరించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా లక్ష్యాలను కుదించడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019-20 ఖరీఫ్‌లో 47,83,347 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించగా, ఈ ఏడాది 2022-23 ఖరీఫ్ సీజన్‌లో 37లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కొనుగోలు ఈ నాలుగేళ్లలో దాదాపు 25శాతం కుదిస్తోంది.
ఇది ఇలా ఉంటే గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం గన్నీ బ్యాగులు 9.25కోట్లు కావాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 55లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే ఉన్నాయి. పూర్తిస్ధాయిలో ప్రభుత్వమే బస్తాలు పంపిణీ చేయాలంటే మరో 8.70కోట్ల బస్తాలు అవసరమవుతాయి. గన్నీ బ్యాగుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం రైతులు స్ధానికంగా గన్నీ బ్యాగులు సమకూర్చుకుంటే వారికి నగదు రూపేణా తిరిగి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఆయా రైతులు సేకరించుకునే గన్నీ బ్యాగులు( క్వింటాలు బస్తాకు) రూ.12.50ల వంతున చెల్లించనుంది. ధాన్యం క్వింటాలు బస్తాలో సర్ధుబాటు చేయాలంటే రెండున్నర బ్యాగులు వాడాల్సి ఉంటుంది. అంటే గన్నీ బ్యాగుకు ప్రభుత్వం సుమారు రూ.5ల వంతున చెల్లించనుంది.
సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు రవాణా వాహనాలు కీలకం. ఇందు కోసం నవంబరు 21,22 తేదీల్లో రవాణా వాహనాలకు టెండర్లు ఆహ్వానించినప్పటికీ పుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (ఎప్‌సిఐ) కిలో మీటరుకు ఎంత ఇవ్వాలనే అంశంపై తుది నిర్ణయం నేటి వరకు తీసుకోలేదు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే వాహనాలో కాకుండా సొంత వాహనాల్లో రవాణా చేస్తే ఆయా రైతులకు 60 రోజుల లోగా ఆ చార్జీలను వారికి ప్రభుత్వం రీ- ఎంబర్స్‌మెంట్ చేయనుంది. 22-23 ఖరీఫ్‌లో కేవలం 37లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం సేకరించిన ధాన్యం
(లక్షల మెట్రిక్ టన్నుల్లో)
19-20 47.83
20-21 47.32
21-22 40.31
22-23 (లక్ష్యం) 37.00










