ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు రబీ ధాన్యం కొనుగోలు పూర్తి పారదర్శకంగా చేస్తామని కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అన్నారు. నీటిపారుదల సలహా మండలి (ఐఏబీ), జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్‌సీ) సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్, నవంబర్‌లోని తుపాన్లకు పంట దొరక్కుండా ఉండేందుకు ముందుగానే అంటే జూన్ 1వ తేదీనే నీటిని విడుదల చేసి ఖరీఫ్ పంట ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది అంచనాలకు మించి 20 నుంచి 25 శాతం మేర దిగుబడి పెరిగిందన్నారు. ఈసారి కూడా చివరి ఎకరా వరకూ సాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తామని స్పష్టం చేశారు. కాలువల మూసివేత సమయంలో కాలువల్లో పూడకతీత, గుర్రపుడెక్క తొలగింపునకు, మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాటుసారా, గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తున్నట్లు వెల్లడించారు.నాడు-నేడు విధానంలో ప్రభుత్వ పాఠశాలలను, ఆసుపత్రులను అభివృద్ధి చేసినట్లు వివరించారు. నవరత్నాలు ద్వారా సమాజంలోని పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారన్నారు.










