ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : జీడి పిక్కల కొనుగోళ్లు, మద్దతు ధరపై ఒక పటిష్ట విధానం రూపకల్పనకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీడి రైతులు ఆందోళన చేయడం, వారిలో ఆవేదన ఉండడం వాస్తవమేనన్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తాను వారి ఆందోళనను పట్టించుకోలేదనడం సరికాదని చెప్పారు. నిర్ధిష్ట విధానం రూపకల్పన చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలు ఆయన డైరక్షన్‌లోనే జరిగాయని మంత్రి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు కుట్రపై పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి సామూహిక హత్యాకాండ జరగకుండా సంయమనం పాటించారన్నారు. పోలీసులు గాయాలపాలైనా పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించి ఆ సానుభూతితో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌పై హత్యాయత్నం, రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిగా ఉన్న సమయంలో బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిలో చిరంజీవి కూడా ఒకరని విమర్శించారు.










