ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : గత ప్రభుత్వం పలు సంస్థల నుంచి నేరుగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన అనుచరుల ఖాతాలకు డబ్బులను దారిమళ్లించారని పశుసంవర్థక శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎటిఎంలా వాడుకున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలోని వైసిపి కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఆగస్టులో ఐటి శాఖ నోటీసులు ఇస్తే రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలకు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. సుమారు 118 కోట్ల రూపాయలు లెక్కల్లో తేడా వచ్చాయని ఐటి శాఖ నోటీసుల్లో పేర్కొందని గుర్తు చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చని తెలిపారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పడం వెనుక రహస్యాలు ఇంకా ఉన్నాయన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ కట్టడం ద్వారా కమీషన్లు కొట్టేశారని విమర్శించారు. వినరు, విక్కి అనే వ్యక్తుల ద్వారా బోగస్ కంపెనీలు రిజిష్టర్ చేసి వాటికి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టి లావాదేవీలు జరిపారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ఎటిఎంలా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. పోలవరం ఒరిజినల్ బిడ్డర్‌ని పక్కన పెట్టి రామోజీరావు వియ్యంకుడుకు చెందిన నవయుగ సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్‌టిఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ పేరుతో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకొన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అక్రమాలపై ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.










