ప్రజాశక్తి - పోలవరం : ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని కొత్త పట్టిసీమ గ్రామం పంట పొలాల్లోని వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు వంద ఎకరాల్లో 40కి పైగా వరికుప్పలు దగ్ధమయ్యాయి. స్థానిక రైతుల వివరాల మేరకు.. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పంట పొలాంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నిప్పులు చెలరేగి వరి కుప్పలపై పడటంతో మంటలు చెలరేగాయి. మంగపతిబోదె మొదలు పాసాల దొడ్డి, రాంచెరువు పుంత, పల్లపు బాడవ వరకూ వంద ఎకరాల పంట పొలాల్లో 40కి పైగా వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దీంతో రైతులు భారీ స్థాయిలో నష్టపోయారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్‌లో నిల్వ చేసిన వరికుప్పలను రైతులు నూర్చలేకపోయారు. ప్రమాద సమయంలో వేడిగాలులు, వడగాలులు ఎక్కువగా ఉండడంతో మంటలను అదుపు చేయలేకపోయారు. సంఘటనా స్థలాన్ని మండల వ్యవసాయ అధికారి కె.రాంబాబు సందర్శించి, బాధిత రైతులతో మాట్లాడారు. పంట నష్టాన్ని పరిశీలించామని, ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.










