Feb 09,2023 07:34
  • నెల రోజులు దాటినా బిల్లులు చెల్లించని ప్రభుత్వం
  • రాష్ట్ర వ్యాప్తంగా రూ.1724 కోట్లు పెండింగ్‌
  • ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన రైతు అన్నెపు భాస్కరరావు గతేడాది డిసెంబరు 28న కొర్లకోట ఆర్‌బికెకు 40 బస్తాలు (ఒక్కో బస్తా 80 కేజీలు) ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వం నుంచి ధాన్యం, రవాణా, గన్నీ బ్యాగులకు కలిపి మొత్తం రూ.80 వేలు రావాల్సి ఉంది. నెల రోజులు దాటినా ఇప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఖరీఫ్‌ సాగు ఖర్చుల కోసం ఆయన నూటికి నెలకు రూ.2 చొప్పున వడ్డీ వ్యాపారుల నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్నారు. ధాన్యం డబ్బులు వస్తే కొంత అప్పు తీర్చి రబీ సాగుకు ఖర్చు చేద్దామనుకున్నారు. డబ్బులు సకాలంలో రాకపోవడంతో, రబీలో నాలుగు ఎకరాల్లో మినప, పెసర పంట సాగు ఖర్చుల కోసం మరో రూ.50 వేలు అప్పు చేశారు.
శ్రీకాకుళం రూరల్‌ మండలం పొన్నాం పంచాయతీకి చెందిన రైతు ఇప్పిలి రమణమ్మ డిసెంబరు 27న రామచంద్రాపురం ఆర్‌బికెకు 120 బస్తాల ధాన్యం ఇచ్చారు. ఆమెకు ప్రభుత్వం నుంచి రూ.1.80 లక్షలు రావాల్సి ఉంది. ఖరీఫ్‌ సాగు ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద నూటికి రూ.రెండు చొప్పున రూ.రెండు లక్షలు అప్పు చేశారు. ధాన్యం డబ్బులు వస్తే రెండో పంట సాగు ఖర్చులకు ఉపయోగపడుతుందని ఆమె ఆశించినా డబ్బులు అందలేదు. దీంతో, రబీలో ఎనిమిది ఎకరాల్లో మినప, పెసర సాగుకు రూ.మరో లక్ష వరకు అప్పు చేశారు.
ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఖరీఫ్‌లో అప్పు చేసి వరి సాగు చేసిన అన్నదాతలు ధాన్యం డబ్బులు సకాలంలో రాకపోవడంతో రబీలోనూ మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వడ్డీల భారం తడిసిమోపెడవుతోంది. ధాన్యం ఇచ్చిన రైతులకు 48 గంటల నుంచి 21 రోజుల వ్యవధిలో చెల్లింపులు చేపడతామని చెప్పిన ప్రభుత్వం నెల రోజులు దాటినా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రూ.1724.66 కోట్లు బకాయి ఉంది. ఇప్పటివరకు 5,61,972 మంది రైతుల నుంచి 31,12,859 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వీరికి రూ.6,503.66 కోట్లుగా ఇవ్వాల్సి ఉండగా, జనవరి 13న చివరిసారిగా రూ.1500 కోట్లు చెల్లించింది. అంతకుముందు చెల్లించిన డబ్బులతో కలిపి రైతుల ఖాతాల్లో మొత్తం రూ.4,779 కోట్లు జమైంది. పండగ తర్వాత ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోనే రూ.362 కోట్ల బకాయిలు
శ్రీకాకుళం జిల్లాలోనే రూ.362 కోట్ల బకాయిలున్నాయి. జిల్లాలో 97,890 మంది రైతుల నుంచి 4,40,227 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.898.09 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.536.45 కోట్లు చెల్లించింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో ముందుగానే సేకరణ చేయడంతో పెద్దగా బకాయిలు లేనట్లు తెలుస్తోంది. విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ.వందల కోట్లు బకాయిలున్నట్లు సమాచారం.
బ్యాంకుల్లో బంగారం మళ్లీ తాకట్టు
ఖరీఫ్‌లో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న రైతులు, ఏటా ఫిబ్రవరి మొదటి వారంలోనే బ్యాంకుల్లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపిస్తారు. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా సాగుతోంది. మిగిలిన బంగారాన్ని రెండో పంట, ఇతర అవసరాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులను జారీ చేయకపోవడంతో తెలిసిన రైతుల ద్వారా తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. డబ్బులు రాక, బ్యాంకులు రుణాలు ఇవ్వక అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.