ప్రజాశక్తి -బుచ్చయ్య పేట : మండలంలో గల పలు గ్రామాలలో శుక్రవారం ఉదయం నుండి చిరుజల్లులు కురుస్తుండడంతో వరి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక రెండు రోజులుగా వాతావరణం చల్లగా ఉండటం ఒకవైపు వరి పంట కోతలకు సిద్ధంగా ఉండడంతో పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండలంలో గల పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట కోతలకు సిద్ధంగా ఉంది. నీలకంఠాపురం, రాజం, పెద్ద మదిన గున్నెంపూడి కొండ పాలెం బుచ్చయ్యపేట తదితర గ్రామాల్లో గత రెండు రోజులుగా కొంతమంది రైతులు వరి పంటను కోసి మడులలోనే విడిచిపెట్టారు. కోసిన వరి పంటను రెండు మూడు రోజులపాటు పొలాల్లో ఎండబెట్టి కుప్పలుగా పెడతారు. అయితే శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి పెద్ద మదిన గుణెంపూడి నీలకంఠాపురం తదితర గ్రామాల్లో కోసి పొలాల్లో విడిచిపెట్టిన వరి పంట తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయాల్లోనే వర్షాలు కురుస్తుండడం వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.










